Let's talk: editor@tmv.in
మహిళల ఆత్మగౌరవంపై దాడి: హోంమంత్రి అనిత

మహిళల ఆత్మగౌరవంపై దాడి: హోంమంత్రి అనిత

Gaddamidi Naveen
17 జూన్, 2026

బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తనపై చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అవమానం కాదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మహిళను, దళితురాలిని అవమానించేలా చేసిన నీచమైన, కులహంకార దాడి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ వైసీపీ సంస్కృతిపై మండిపడ్డారు.

ఆ వైసీపీ నేత ఉపయోగించిన భాష బహిరంగంగా పునరావృతం చేయలేనంత అసహ్యకరంగా ఉందని, ఇది ఆ పార్టీ పెంచి పోషించిన సంస్కృతిని బహిర్గతం చేస్తోందని అనిత పేర్కొన్నారు. స్వయంకృషి, ప్రజాసేవతో ఒక మహిళ పైకి ఎదిగితే, రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు పురుషులు ఇలాంటి దుర్భాషలకు, బెదిరింపులకు దిగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి దాడులను ఎన్నో ఎదుర్కొన్నానని, ఇవి తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేశాయే తప్ప తానెన్నడూ లొంగిపోనని, మౌనంగా ఉండనని స్పష్టం చేశారు.

ఈ దాడి కేవలం తనపై జరిగింది కాదని, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళా ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని హోంమంత్రి పేర్కొన్నారు. మహిళలను శక్తి స్వరూపిణులుగా గౌరవించే మన సంస్కృతిలో, ఒక మహిళ బాధ్యతాయుతమైన పదవిలోకి వస్తే వైసీపీ నేతలు దూషణలు, కులదూషణలకు దిగడం వారి నిజస్వరూపాన్ని చూపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ.. ఎన్డీయే ప్రభుత్వ చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పార్టీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని అనిత పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీయే మహిళలను నాయకత్వ స్థానాల్లోకి ప్రోత్సహిస్తుంటే, వైసీపీ మాత్రం వారిపై శత్రుత్వాన్ని, అవమానాలను ప్రదర్శిస్తోందని అనిత ఎండగట్టారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, భవిష్యత్తులో మహిళా ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. వైసీపీ యొక్క ఈ మహిళా ద్వేషాన్ని, కుల అహంకారాన్ని, బెదిరింపు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.