
కావలిలో ఎస్టీ మహిళపై దాడి.. బాధితురాలిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 24వ వార్డులో ఎస్టీ మహిళపై జరిగిన దాడి ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున పూర్తి నైతిక మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఈ దాడి వెనుక గతంలో టీడీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసిన వ్యక్తి ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తిని ఆరో ముద్దాయిగా చేర్చారని, వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను సవరించి తొలి ముద్దాయిగా చేర్చి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలి కుమారుడిపై నమోదు చేసినట్లు ఆరోపిస్తున్న అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని విమర్శించారు. జిల్లా ఎస్పీ సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
