
కాంగ్రెస్ నాయకుడిపై దాడి.. మన్నె క్రిశాంక్ సహా ఎనిమిది మంది అరెస్ట్
సోషల్ మీడియా పోస్టు విషయంలో కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిశాంక్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి. రాజేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తనపై పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు ఆగ్రహించిన క్రిశాంక్, మరో 10 నుంచి 15 మంది మద్దతుదారులతో కలిసి గురువారం తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని రాజేంద్ర కుమార్ ఆరోపించారు. తనపై దాడి చేయడమే కాకుండా, తన మొబైల్ ఫోన్‌ను లాక్కొని ధ్వంసం చేశారని, చంపేస్తామని బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజేంద్ర కుమార్ ఫిర్యాదు ఆధారంగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రిశాంక్ మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను నగర కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి మే 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రాజకీయ విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ అరెస్టులు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.
అక్రమ కేసులకు భయపడబోం: మన్నె క్రిశాంక్
ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలపై స్పందించని రేవంత్ సర్కార్, ప్రశ్నలను అణచివేసేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని క్రిశాంక్ విమర్శించారు. కాంగ్రెస్ మంత్రుల అవినీతిని ఎండగట్టినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఇలాంటి వేధింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అక్రమాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన మీడియాకు వెల్లడించారు.
