Let's talk: editor@tmv.in
ఏలూరులో దారుణం..మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం

ఏలూరులో దారుణం..మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం

Panthagani Anusha
10 మే, 2026

ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక వ్యక్తి, మృగంలా మారి మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం నిందితుడు చౌటపల్లి రాంబాబు స్థానికంగా పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి కుటుంబంతో ఉన్న పరిచయంతో ప్రార్థనల నిమిత్తం తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సదరు మైనర్ బాలికపై కన్నేసిన రాంబాబు, గత నాలుగు నెలలుగా ఆమెను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెట్టడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన నిందితుడు, తన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు బలవంతంగా అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆరోగ్యం క్షీణించింది. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో ఆమెపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.

పోక్సో కేసు నమోదు

ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడు రాంబాబుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడితో పాటు ప్రాణహాని కలిగించే విధంగా మందులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు.

ఇక నమ్మకమైన పరిచయస్తులే చిన్నారులపై ఇలాంటి దారుణాలకు పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడిన రాంబాబును కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పరిచయస్తుల పట్ల కూడా నిఘా ఉంచాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.