Let's talk: editor@tmv.in
రైతుకు భరోసా - వ్యవసాయానికి పునర్వైభవం: మంత్రి అచ్చెన్నాయుడు
రైతుకు భరోసా - వ్యవసాయానికి పునర్వైభవం: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుకు భరోసా - వ్యవసాయానికి పునర్వైభవం: మంత్రి అచ్చెన్నాయుడు

Gaddamidi Naveen
30 జూన్, 2026

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, వ్యవసాయ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టి అన్నదాతకు పునర్వైభవం తీసుకురావడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులోని లాంఫాంలో గల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఏరువాక పౌర్ణమి’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పొలంలో స్వయంగా ఎద్దుల నాగలితో దున్ని ఈ ఖరీఫ్ సాగు పనులను మంత్రి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 66 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, అందుకే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న విత్తన సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి కంపెనీల పాత బకాయిలను తాము చెల్లించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో అవినీతిని అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా కేవలం 20 రోజుల్లోనే 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలను పంపిణీ చేశామ‌ని తెలిపారు. ఈ డిజిటల్ సేవల ద్వారా దాదాపు 3 లక్షలకు పైగా కౌలు రైతులు నేరుగా వినియోగించుకున్నారని చెప్పారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు మట్టి పరీక్షల ఆధారంగానే సమతుల్యంగా ఎరువులను వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు

మార్కెట్ పరిస్థితులు, వాతావరణ మార్పులను గమనిస్తూ రైతులు ప్రత్యామ్నాయ, ఉద్యానవన పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ఒకే పంటపై ఎక్కువగా ఆధారపడితే నష్టాలు తప్పవని హెచ్చరించారు. మిర్చి పంటలో మితిమీరిన రసాయనాల వాడకం వల్ల గుంటూరు మిర్చి కంటైనర్లు చైనా నుంచి వెనక్కి వచ్చిన ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు.

రైతుల ప్రయోజనాల కోసం వర్జీనియా పొగాకు కొనుగోలు ధర కిలోకు రూ. 200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది ఉత్పత్తి పరిమాణాన్ని 81 మిలియన్ కిలోలుగా నిర్ణయించామని వెల్లడించారు. గత ఏడాది హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు రూ. 273 కోట్లు, అలాగే తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ. 4 చొప్పున అదనపు సాయం అందించామని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని నేరుగా ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు.

వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్ల రాజధాని అమరావతిని ధ్వంసం చేసి, భూములిచ్చిన రైతుల కన్నీళ్లను పట్టించుకోని జగన్‌కు ఇప్పుడు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. అమరావతి రైతుల సహనానికి హద్దు ఉంటుందని, ఆ హద్దు దాటితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, వర్సిటీ వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
HorticultureAndhraPradeshFarmersAgricultureEruvakaPournamiAgricultureNewsFarmerWelfareNDAGovernmentChandrababuNaidu
రైతుకు భరోసా - వ్యవసాయానికి పునర్వైభవం: మంత్రి అచ్చెన్నాయుడు - Tholi Paluku