
ఆస్తులు, పదవులు శాశ్వతం కాదు.. మంచి పనులే చిరస్థాయిగా నిలుస్తాయి: హరీష్ రావు
సిద్ధిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో నిర్వహించిన 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.
చిన్నారులకు పునర్జన్మ కల్పిస్తున్న వైద్య బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని హరీష్ రావు అన్నారు. ఆసుపత్రి వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ను తాను పొగడటానికి కాదని, నిజంగానే ఆయన కనిపించే దేవుడని పేర్కొన్నారు. దేవాలయంలో కనిపించని దేవుడిని ప్రార్థిస్తామని, కానీ శ్రీనివాస్ ప్రతి సంవత్సరం వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
ప్రతి ఏడాది సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించడం సాధారణ విషయం కాదని, ఇది శ్రీనివాస్ అంకితభావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనమని అన్నారు. స్వంత సంపాదనతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం గొప్ప విషయమని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నారని, వారి తల్లిదండ్రుల కళ్లలో కనిపించిన ఆనందం ఆసుపత్రి సేవలకు నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని పరిశుభ్రత, వైద్య సేవలు, ప్రేమ, ఆప్యాయత ఇక్కడ లభిస్తున్నాయని అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరుచుకోవాలని, ఇతరులు చేస్తారని ఎదురు చూడకుండా తమకు తోచినంతగా అవసరమైన వారికి సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను నాలుగోసారి ఈ ఆసుపత్రికి వచ్చానని, ప్రతి సారి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా బయటకు వస్తున్న చిన్నారులను చూసినప్పుడు హృదయం ఆనందంతో నిండిపోతుందని చెప్పారు.
జీవితంలో మనం ఎంత పెద్ద పదవులు అనుభవించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది ముఖ్యం కాదు. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ మనం చేసిన మంచి పని, సేవ మాత్రమే సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, తన ఏడాది జీతాన్ని సత్యసాయి ట్రస్ట్‌కు అందజేస్తానని ప్రకటించారు.
