
అస్సాం యూసీసీ బిల్లు ముస్లింలపై హిందూ చట్టాన్ని రుద్దడమే:ఎంపీ అసదుద్దీన్
అస్సాం శాసనసభలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లు ముస్లింలపై "వెనుక తలుపు గుండా హిందూ చట్టాన్ని రుద్దడమే" అని ఆయన విమర్శించారు. వివాహాలు, ఆస్తి వారసత్వం, విడాకుల విషయాలలో ముస్లింలపై హిందూ సూత్రాలను బలవంతంగా విధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ విషయమై ఓవైసీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. అస్సాం యూసీసీ బిల్లు ద్వారా కేవలం హిందూ సంస్కృతిని మాత్రమే రక్షిస్తున్నారు. ముస్లింలు మాత్రం ఈ పేరుకు మాత్రమే ఉన్న ఏకరూప నిబంధనలను కచ్చితంగా పాటించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
అస్సాం సీఎం వివరణ
అస్సాం ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ‘ది యూనిఫాం సివిల్ కోడ్, అస్సాం, 2026 బిల్లు’ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా బహుభార్యాత్వాన్ని నిషేధించడంతో పాటు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయనున్నారు. అయితే, అస్సాంలో నివసిస్తున్న ఏ ఒక్క షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) ఈ చట్టం వర్తించదని బిల్లులో స్పష్టం చేశారు.
ఈ బిల్లు యొక్క ఉద్దేశాలు, కారణాలను వివరిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. వివాహం, విడాకులు, వారసత్వం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు. జీవిత భాగస్వాములకు భరణం, వారసత్వం, ఇతర చట్టపరమైన రక్షణలు కల్పించడంలో వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుందని, ఆస్తి పంపిణీలో సమానత్వాన్ని తీసుకురావడానికి వారసత్వ చట్టాలను ఆధునీకరించడమే యూసీసీ ముఖ్య ఉద్దేశమని సీఎం బిశ్వ శర్మ తెలిపారు.
అస్సాం తీసుకొచ్చిన యూసీసీలో ఎలాంటి ఏకరూపత లేదని ఓవైసీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి సమాజానికి తమ సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉందని, అలాంటప్పుడు కేవలం గిరిజన సంఘాల స్వయంప్రతిపత్తిని మాత్రమే ఎందుకు రక్షిస్తున్నారని, ముస్లింలను ఎందుకు మినహాయించలేదని ప్రశ్నించారు. ఎవరికీ అవసరం లేని చట్టాన్ని బలవంతంగా రుద్దుతున్నారని, రాజ్యాంగ పరిషత్ కూడా నిర్బంధ యూసీసీని ఊహించలేదని గుర్తుచేశారు.
ఇస్లాం ప్రకారం వారసత్వ హక్కులను ఎవరూ నిరాకరించలేరని, ఒకే కుమారుడికి మొత్తం ఆస్తి ఇచ్చేలా విల్ రాసే అవకాశం లేదని ఆయన చెప్పారు. “కానీ ఈ యూసీసీ ప్రకారం ఎవరైనా తమ ఆస్తిని ఒకరికి మాత్రమే ఇచ్చి, కుమార్తెలకు వాటా నిరాకరించే అవకాశం ఉంటుంది. ఇది మహిళలకు ఏమాత్రం న్యాయం చేసే చట్టం కాదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
