
ఆసియా బీచ్ గేమ్స్: భారత మహిళల జట్టుకు స్వర్ణం
ఆసియా బీచ్ గేమ్స్-2026లో భారత మహిళల కబడ్డీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించారు. ఈ విజయంతో ఆసియా బీచ్ గేమ్స్ చరిత్రలో ఆడిన ఆరు ఎడిషన్లలోనూ వరుసగా ఆరోసారి స్వర్ణం గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
రీతు సేన అద్భుత ప్రదర్శన
ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. విరామ సమయానికి భారత్ 20-18తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రెండో సగంలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. అంతిమంగా 47-31 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి పసిడిని ముద్దాడారు. కెప్టెన్ రీతు నేతృత్వంలోని ఈ జట్టులో మనీషా కుమారి, సిమ్రాన్ కాంబోజ్, మన్‌ప్రీత్ కౌర్, నికిత, నికిత చౌహాన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భారత్ 50-31తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
పురుషుల జట్టుకు రజతం
మరోవైపు పురుషుల కబడ్డీ విభాగంలో భారత్‌కు రజత పతకం దక్కింది. ఫైనల్‌లో ఇరాన్ జట్టుతో తలపడిన భారత్ 31-44 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సగం ముగిసేసరికి ఇరాన్ 23-11తో ముందంజలో నిలిచింది. భారత కెప్టెన్ బ్రిజేంద్ర సింగ్ చౌదరి బృందం చివరి వరకు పోరాడినప్పటికీ ఇరాన్ స్కోరును దాటలేకపోయింది. దీంతో పురుషుల జట్టు వరుసగా రెండోసారి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పదేళ్ల తర్వాత గ్రాండ్ రీ-ఎంట్రీ
కరోనా కారణంగా సుదీర్ఘ కాలం వాయిదా పడిన ఆసియా బీచ్ గేమ్స్, దశాబ్దం తర్వాత చైనాలోని సాన్యలో ఘనంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో భారత్ తరపున 31 మంది సభ్యులతో కూడిన బృందం నాలుగు విభాగాల్లో (బాస్కెట్‌బాల్, కబడ్డీ, సెయిలింగ్, రెజ్లింగ్) పోటీ పడుతోంది. సోమవారం కబడ్డీలో వచ్చిన ఈ రెండు పతకాలు ప్రస్తుత టోర్నీలో భారత్‌కు తొలి పతకాలు కావడం విశేషం. కాగా ఈ విజయం పట్ల క్రీడాభిమానులు, భారత ఒలింపిక్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది.
