
అడ్డుకోవాలని చూస్తే విఫలమవుతారు
తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, తమను అడ్డుకోవాలని చూస్తే విఫలమవుతారని చైనా అమెరికాకు బలమైన హెచ్చరికలు జారీ చేసింది. చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేపాల్ ఉద్రిక్తతలు సహా దక్షిణాసియాలోని పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. చైనా విషయాల్లో జోక్యం చేసుకోవడం, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అది విఫలమవుతుందని హెచ్చరించారు. అమెరికాకు చైనాను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశం లేదని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఏ విషయంలో అయినా చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు.
తైవాన్, దక్షిణ చైనా సముద్రం చర్చ
ఈ సమావేశంలో తైవాన్, దక్షిణ చైనా సముద్రం, రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలపై చర్చ జరిగింది. దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా నేపాల్లో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా డాంగ్ జున్ తైవాన్కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా తన శక్తిని ఉపయోగించి తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతిస్తూ, చైనాను అణచివేయాలని చేసే ప్రయత్నాలు ఫలించవన్నారు. చైనా తైవాన్ను తమ భూభాగంగా భావిస్తుందని, అవసరమైతే సైనిక బలాన్ని ఉపయోగించి దాన్ని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వెనుకాడదని స్పష్టం చేశారు. అమెరికా చైనాకు అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తూనే తైవాన్ ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారిందన్నారు. దాడి జరిగితే తైవాన్ను రక్షించేందుకు సహాయం చేస్తామని అమెరికా వాగ్దానం చేసిందని ఆరోపించారు.
సైనిక సంబంధాలకు సిద్ధమే
దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దేశాలు ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయని, ఈ ప్రాంతానికి చెందని దేశాలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నాయని డాంగ్ ఆరోపించారు. ఈ సముద్రంపై చైనా దాదాపు పూర్తి ఆధిపత్యం కలిగి ఉన్నట్లు చెబుతోంది. దీన్ని ఆసియా దేశాలు సవాలు చేస్తున్నాయి. అమెరికా ఈ సముద్రంలో "స్వేచ్ఛా నావిగేషన్" కార్యకలాపాల పేరుతో నౌకలను పంపుతూ చైనా వాదనలను తిరస్కరిస్తోంది. చైనా మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికాతో స్థిరమైన సైనిక సంబంధాలు కొనసాగించడానికి చైనా సిద్ధంగా ఉందని డాంగ్ జున్ తెలిపారు. రెండు దేశాల మధ్య సమానత్వం, గౌరవం, శాంతియుత సహజీవనంతో కూడిన సైనిక సంబంధాలను నిర్మించాలని, చైనా ప్రధాన ఆసక్తులను అమెరికా గుర్తించాలని ఆయన కోరారు. అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి సీన్ పార్నెల్ ఈ చర్చలను స్పష్టమైనవి, రచనాత్మకమైనవిగా అభివర్ణించారు. అమెరికా చైనాతో సంఘర్షణ కోరడం లేదని, చైనాలో పాలన మార్పు కోసమో, ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు కీలక ఆసక్తులు ఉన్నాయని, వాటిని గట్టిగా కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. తైవాన్ జలసంధిలో శాంతి, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా రాకపోకలకు అమెరికా మద్దతిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు. రెండు దేశాల మంత్రులు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపడానికి అంగీకరించారు. పెద్ద విభేదాలు పరిష్కారం కాకపోయినా చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
అమెరికాతో ముదురుతున్న విభేదాలు
వాణిజ్య ఒప్పందాలు, ఎస్సీవో సదస్సు నేపథ్యంలో చైనా, అమెరికా మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి సున్నితమైన అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చైనా తన ఆధిపత్య విధానాన్ని కొనసాగిస్తూ, అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా మాత్రం శాంతి, స్వేచ్ఛా నావిగేషన్ను సమర్థిస్తూ, తన ఆసియా, పసిఫిక్ ఆసక్తులను కాపాడుకుంటోంది. భారత్ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న సమయంలో అమెరికాతో ఉద్రిక్తతలు పెరగడం చర్చనీయాంశంగా మారింది. రష్యా చమురు కొనుగోళ్లు, ట్రంప్ సుంకాల విధానం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలీ చైనా అనుకూల నాయకుడిగా భావించబడ్డారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్లలో యువత నిరసనలతో ఇటీవి కాలంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ మార్పుల వెనుక పెద్ద శక్తులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తైవాన్, దక్షిణ చైనా సముద్రం వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కాకపోతే ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
