
నేపాల్ జైళ్ల నుంచి ఖైదీలు పరార్!
నేపాల్లో జెన్ జీ ఉద్యమంతో ప్రధాని రాజీనామా, సైన్యం పాలనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికార శూన్యత్వాన్ని ఆసరాగా చేసుకొని ఖాట్మాండు, పోఖరా, లాలిత్పూర్ జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయారు. గురువారం రమేచాప్ జిల్లా జైలులో భారీ ఎత్తున ఖైదీలు పారిపోతుండగా అడ్డుకోవడానికి నేపాల్ సైన్యం కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో 13 మంది ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఖైదీలు జైలు లోపలి తాళాలు బద్దలుకొట్టి ప్రధాన ద్వారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని జిల్లా అధికారి శ్యామ్ కృష్ణ తాపా వెల్లడించారు. ప్రధాన ద్వారం వరకు చేరుకున్న వారిపై సైన్యం కాల్పులు జరపింది. దీంతో 13 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని జిల్లా అధికారులు వెల్లడించారు.
ప్రజలు శాంతంగా ఉండాలన్న బాలెన్ షా
ఖాట్మాండు, పోఖరా, లాలిత్పూర్ జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, నేపాల్ సరిహద్దులో ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్నగర్ వద్ద సశాస్త్ర సీమా బలం 22 మంది నేపాల్ ఖైదీలను పట్టుకుంది. నేపాల్లో హింస నేపథ్యంలో ఎస్ఎస్బీ అప్రమత్తంగా ఉంది. పెట్రోలింగ్ పెంచి, డిప్లాయ్మెంట్ బలోపేతం చేసి, సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశారు. జెన్ జెడ్, ప్రజలు శాంతంగా ఉండాలంటూ ఖాట్మాండు మేయర్ బాలెన్ షా గురువారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. దేశం ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్కు మారుతున్న సమయంలో కొత్త ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఈ సమయం అసాధారణమని, యువత ఆందోళనకు గురికాకుండా ఓర్పుతో ఉండాలని కోరారు.
మళ్లీ ఎన్నికలు జరిగితేనే స్థిరత్వం
నేపాల్లో జరుగుతున్న అల్లర్లు, రాజకీయ అస్థిరత దేశ భద్రతా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. జైళ్ల నుంచి ఖైదీలు పరారవ్వడం అధికారుల పర్యవేక్షణా లోపాన్ని స్పష్టం చేస్తుంది. సామన్య ప్రజల భద్రతపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రమేచాప్ ఘటనలో ఖైదీలపై సైన్యం కాల్పులు హింసను అరికట్టేందుకే అయినా, ఖైదీలు తీవ్రంగా గాయపడటం మానవ హక్కులపై చర్చలకు దారితీస్తుంది. భారత్ సరిహద్దులో ఎస్ఎస్బీ చర్యలతో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్నట్లు స్పష్టం చేస్తోంది. కానీ, ఖైదీల పారిపోవడం పొరుగు దేశాల భద్రతపై ఆందోళన పెంచుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే భారత్ సరిహద్దుల్లో భద్రత పెంచింది. ఏదేమైనా నేపాల్లో మళ్లీ ఎన్నికలు జరిగితే స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
