Let's talk: editor@tmv.in
కవ్విస్తోన్న అమెరికా

కవ్విస్తోన్న అమెరికా

FL - TRND
12 సెప్టెంబర్, 2025

చైనా-తైవాన్ యుద్ధం ముంచుకొస్తుందా? డొనాల్డ్ ట్రంప్ చైనాను రెచ్చగొడుతున్నారా? తైవాన్ భయంతో అమెరికా వైపు చూస్తుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తైవాన్ విషయంలో చైనా, అమెరికా మధ్య మరోసారి మాటల యుద్ధం రగిలింది. ఇది తైవాన్ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపుతోంది. చైనాను అడ్డుకోవాలని, నియంత్రించాలని లేదా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోమని బీజింగ్ నేరుగా హెచ్చరించింది. ఇటు అమెరికా మాత్రం చైనా వాదనను అంగీకరించడంలేదు. చైనా ప్రభుత్వాన్ని కూలదోసే యత్నంలో తాము లేమని అమెరికా చెబుతోంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చింది. తైవాన్ రక్షణ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని అమెరికా కుండబద్దలు కొట్టింది. తైవాన్కు ఆయుధాలు అందిస్తూ, అవసరమైతే నేరుగా రక్షణ రంగంలోకి దిగుతామని అమెరికా స్పష్టం చేయడం ప్రకంపనలు రేపింది.

ఇటు దక్షిణ చైనా సముద్రంపై కూడా ఇరు దేశాల గొడవలు తగ్గడంలేదు. చైనా దాదాపు మొత్తం సముద్రం తమదేనని చెప్పుకుంటుంటే, అమెరికా మాత్రం 'స్వేచ్ఛా నావికా ప్రయాణాల' పేరుతో యుద్ధనౌకలను తరచుగా అక్కడి జలాల్లోకి పంపుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. ఇటు చైనా గౌరవం, సమానత్వం కోరుకుంటే, అమెరికా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే, యుద్ధం కేవలం ఒక నిప్పు కణిక దూరంలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. మరోవైపు తైవాన్ తాము శాంతిని కోరుకుంటామని చెబుతోంది. అయితే తమ భద్రత కోసం పోరాడతామంటూ చైనాకు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇలాంటి సమయంలో ఓసారి చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది.

1949లో చైనా రెండు భాగాలుగా చీలిపోయింది. మావో జెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం బీజింగ్లో అధికారం చేపట్టింది. మరోవైపు చాంగ్ షెక్ నేతృత్వంలోని నేషనలిస్టులు తైవాన్కు వెళ్లిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి తైవాన్ స్వతంత్రంగా కొనసాగుతోంది. ఇటు చైనా మాత్రం తైవాన్ను తమ భూభాగంగానే చెప్పుకుంటోంది. తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు తైవాన్కు అమెరికా మద్దతు ఇస్తూ రక్షణ కల్పిస్తోంది.

అమెరికాలో ఏ అధ్యక్షుడు అధికారంలో ఉన్న తైవాన్కు మద్దతుగానే ఉంటారు. 2016-2020 మధ్య అమెరికాను నడిపించిన ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి విడత పాలనలో తైవాన్కు అన్ని విధాల అండగా నిలిచారు. అత్యాధునిక ఆయుధాలను తైవాన్కు అందించారు. ఇప్పుడు మరోసారి అదే మాటపై ఉన్నారు ట్రంప్. తైవాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధునాతన ఆయుధ వ్యవస్థలను, రాడార్ టెక్నాలజీలను, యుద్ధ విమానాలను తైవాన్కు పంపుతోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా నౌకాదళం తైవాన్ సమీపంలో యుద్ధ నౌకలను మోహరించింది. ఇది చైనాను మరింత రెచ్చగొట్టేలా చేసింది. తైవాన్పై ఎవరైనా దాడి చేస్తే, అది అమెరికా మీద దాడి చేసినట్లేనని డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పిన ఓ మాట అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీనిబట్టి చూస్తే తైవాన్పై చైనా తన దాడిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి 2027లో చైనా తైవాన్ను ఆక్రమించొచ్చని అమెరికా నిఘా వర్గాలు గతంలో చెప్పాయి. కానీ 2025లోనే.. అంటే ఈ ఏడాదే చైనా తన దాడి మొదలుపెట్టొచ్చు. ప్రస్తుతం చైనా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను తైవాన్ సరిహద్దుల్లో తిప్పుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ తైవాన్పై చైనా విరుచుకుపడితే అది మూడో ప్రపంచం యుద్ధానికి దారితియ్యవచ్చు. ఎందుకంటే తైవాన్ను చైనా ఆక్రమిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదు. చైనాపై అమెరికా నేరుగా బరిలోకి దిగితే పరిస్థితి చాలా భయంకరంగా మారడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

కవ్విస్తోన్న అమెరికా - Tholi Paluku