Let's talk: editor@tmv.in
ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ దారుణ హత్య

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ దారుణ హత్య

Venkatesh Balusula
12 సెప్టెంబర్, 2025

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. సంప్రదాయవాద కార్యకర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహిత మిత్రుడు ఛార్లీ కిర్క్ యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో బుధవారం హత్యకు గురయ్యాడు. వర్సిటీలోని ఓ కార్యక్రమంలో కిర్క్ ప్రసంగిస్తుండగానే దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో కిర్క్ తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గన్ హింస గురించి చర్చిస్తుండగానే దాడి

యూటా వ్యాలీ యూనివర్సిటీలో ఛార్లీ కిర్క్ కార్యక్రమంపై ముందుగానే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్లీ తన ప్రసంగంలో ప్రధానంగా గన్ హింస, మాస్ షూటింగ్లపై చర్చించారు. అదే సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఛార్లీ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ అమెరికన్లు ఎన్ని మాస్ షూటింగ్స్కి బాధ్యులయ్యారని కిర్క్ అడిగారు. దీనికి సమాధానంగా ప్రేక్షకులు చాలామంది ఉన్నారని చెప్పారు. గ్యాంగ్ హింసను కూడా లెక్కలో పెట్టాలా? అని ఛార్లీ ప్రశ్నించాడు. అనంతరం కొన్ని క్షణాల తర్వాత నేరుగా ఒక తూటా ఛార్లీ గొంతులోకి దూసుకొచ్చింది. అతడికి తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వైరల్గా మారిన వీడియో

ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫుటేజీలో కిర్క్ మైక్రోఫోన్ పట్టుకొని బహిరంగ గుడారంలో కూర్చొని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న దృశ్యం కనిపిస్తుంది. తుపాకీ పేలిన వెంటనే విద్యార్థులు భయంతో అరుస్తూ, పరుగులు తీసిన దృశ్యాలు చూడవచ్చు. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంపస్లో పోలీసులు సైతం ఉన్నారు. వర్సిటీ భవనంపై నుంచి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ హత్యపై స్పందించారు. ఇది చాలా దారుణమైన హత్య అని, అత్యంత సన్నిహితుడిని కోల్పోయానని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు సహించేది లేదని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెలానియా ట్రంప్ కిర్క్ భార్య ఎరికా, వారి ఇద్దరు చిన్నారులకు సానుభూతి తెలిపారు. కిర్క్ గత కొన్నేళ్లలో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. చికాగో శివార్లలో పెరిగిన కిర్క్, పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. హార్పర్ కాలేజీలో చేరినప్పటికీ, రాజకీయ కార్యకర్తగా పూర్తిస్థాయిలో పని చేయడానికి చదువును వదిలేశాడు.

దర్యాప్తు చేపట్టిన ఎఫ్బీఐ

ఈ ఘటన అమెరికాలో గన్ హింస సమస్యను మరోసారి లేవనెత్తింది. కిర్క్ గన్ హింస గురించే మాట్లాడుతూ హత్యకు గురికావడం గమనార్హం. ఈ హత్య రాజకీయ హింస, గన్ కంట్రోల్ చర్చలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. రాజకీయంగా, మాగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కిర్క్ మరణం ఆయా వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ట్రంప్ వంటి నాయకుల స్పందనతో ఈ దాడి వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యువతలో కిర్క్కు ఎంతో ప్రజాదరణ ఉంది. రాజకీయ రంగంలో యువత ప్రవేశంపై కిర్క్ ప్రభావం ఎంతగానో ఉంది. ఈ హత్య వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు, దాడి చేసిన వ్యక్తి గురించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది.

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ దారుణ హత్య - Tholi Paluku