
అనగనగా.. ఓ తాత.. ఓ బామ్మ!
ఈరోజు కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ‘ నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే’. ఇలా ఒక రోజు ఉందా! అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మరి. అయినా ఈ రోజుల్లో యువత వి ఉరుకులు పరుగుల జీవితాలు, పిల్లలేమో జైల్లో మగ్గుతున్న ఖైదీలుగా ఒత్తిడి తో కూడుకున్న బాల్యం. ఇక కాస్త ఊరటనిచ్చేలా మాట్లాడి, మళ్లీ కొత్త ఉత్సాహం నింపే అమ్మమ్మ తాతయ్యల మాట అసలు లేనే లేదు, ఎందుకంటే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటారు గాని, అందులో అమ్మమ్మ తాతయ్యలు కూడా కుటుంబంలో భాగమే కదా! అనేది ఆలోచించారా!
మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా మనుషులు మారుతున్నారు సరే! బంధాలు ఎందుకు మారుతున్నాయి. వేల మైళ్ళ దూరం లో ఉన్నా ఉత్తరాలలో ప్రయాణించిన ఆప్యాయతలు అరచేతిలో ప్రపంచాన్ని తెచ్చి పెట్టిన మొబైల్ ఫోన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి. చిన్న తనం లో వాళ్లే ప్రపంచం అనిపించే అమ్మా నాన్న, వయసు పెరిగే కొద్దీ ఎందుకు పిల్లలకు భారంగా తోస్తున్నారు. కాల చక్రం తిరిగి మళ్లీ మొదలు పెట్టిన దగ్గరకే వస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. బాల్యం లో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలతో గడిపే ఆ ఆనందపు క్షణాలు నేటి తరానికి అందని అద్భుతాలు.
ఒక ‘చిన్ని’ కథ :
పండగ మొదలైయింది, దసరా సంబరాలు జరుగుతున్నాయి అందమైన పూలు ఒక్కొక్కటిగా పేర్చి బతుకమ్మ చేస్తున్న అమ్మ ను చూస్తూ అమాయకంగా అడిగింది చిన్ని, అమ్మమ్మ తాతయ్య ఈ పండగకి కూడా మనింటికి రావట్లేదా అని!
లేదమ్మా నువ్వు నేను నాన్న అంతే అంది అమ్మ,
అమ్మమ్మ రాలేదని చిన్ని ఎదురుచూపు లో నిరాశ అర్థమైందేమో! నాన్నకి. పక్కనే కూర్చొని బుజ్జగిస్తున్నాడు. ఇప్పుడు అక్క హాస్టల్ లో ఉందిగా అలాగే అమ్మమ్మ తాతయ్య హాస్టల్ లో ఉన్నారు అని, అర్ధం కానట్టు మొహం పెట్టింది చిన్ని. ఒకప్పుడు వేసవి సెలవుల్లో అయినా అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి అంటూ ఆడుతూ పడుతూ చెక్కర్లు కొట్టేది. ఇప్పుడు వాళ్ళు అందరు ఎందుకు మాయమైపోయారు. హాస్టల్ లో ఎందుకు ఉన్నారు, ఎవరిని అడగాలో తెలియలేదు ఆ చిన్ని మనసుకు.
తన చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆరుబయట వెన్నెల్లో మంచం వేసుకొని కూర్చుని ముద్దలు కలిపి తినిపిస్తూ, కథలు చెప్పేది అమ్మమ్మ. పక్కనే విసన కర్ర పట్టుకొని బుల్లి మహారాణి అంటూ మనవరాలిని ముద్దు చేసేవారు. ఉదయం లేస్తూనే తాత వేలు పెట్టుకొని నడుస్తూ తోట దారి అంతా నడుస్తూ ఇవేంటి అవేంటి అంటూ వందల ప్రశ్నలు. తాతయ్య మాత్రం ఓపికగా అన్నిటికి సమాధానం ఇచ్చేవారు. ఓహో! మా తాతయ్య కు అన్నీ తెలుసునే అనిపించేది. మరి! తాతయ్య ఎందుకు హాస్టల్ లో ఉన్నాడు.
వాళ్ళ గురించే ఆలోచిస్తూ బెంగ పెట్టుకుందేమో, చిన్నికి జ్వరం వచ్చేసింది. అమ్మమ్మ పేరు తప్ప మరి ఇంకేమి లేదు, చిన్ని ఒకటే కలవరిస్తుంది. బడికి పోనంటుంది. నాన్న ప్రేమగా మంచం పక్కన కూర్చొని చిన్ని తల నిమురుతూ అమ్మమ్మ రేపు వచ్చేస్తుంది అన్నాడు. నిద్రలోకి జారుకున్న చిన్ని లేచేసరికి అమ్మమ్మ తాతయ్య వచ్చేసారు.
ఒక్క క్షణమ్ లో జ్వరం మంత్రం వేసినట్టు పోయిందేమో కొత్త ఉత్సహం తో అమ్మమ్మ ను హత్తుకుంది. మళ్లీ వెళ్ళవుగా అని ఆశగా అడిగింది. పోను అని పైకి చెప్తుంది కానీ వెళ్లక తప్పదు అన్నట్టుగా మనసులో అనుకుంటూ చిన్ని చెయ్యి గట్టిగా పట్టుకుంది. తాత తో ఎన్నో ఆటలు ఆడింది. బంతి విసిరి పట్టుకోమంది. తన వెంట పరిగెత్తమంది. తాత అమ్మమ్మ తో కలిసి వైకుంఠ పాళీ నేర్చుకుంది. ఆట నేర్పుతూ అమ్మమ్మ చెప్తుంది. . . నువ్వు చిన్న పిల్లవి కదా! ఎప్పుడూ ఎవరో ఒకరు నీ వెంట ఉండరు. మేము దారి మాత్రమే చెప్తాం ప్రయాణించాల్సింది నువ్వే.
అంతలో పాము మింగేసింది చిన్ని పావును. అయ్యో అంటూ ఏడుస్తుంది. తాత నిన్ను ఓడించలేదు అది ఆటలో భాగం. జీవితం లో కూడా నీకు ఎదురయ్యే ప్రతి కష్టం, ఆటలో పాము మింగినట్టు నిన్ను కిందికి పడేస్తుంది. లేచి మళ్లీ పోరాడాలి. అనుకున్నది సాదించాలి. రాత్రి భోజనానికి సమయం అయ్యేసరికి అందరు కూర్చున్నారు. వేరు వేరు రకాల పళ్లెం లలో వడ్డించారు. తాతయ్య సత్తు పళ్లెం చూస్తూ ఎందుకని అని అడిగింది చిన్ని. తాతయ్య ముసలాయన అయిపోయాడు కదా, పట్టుకోవడం రాక కింద పడేస్తారేమో, తినరాదు కదా అందుకే అంటూ అమ్మమ్మ సర్ది చెప్పింది. ఔను! కదా అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఐపోయాక కూడా ఈ పళ్లెం దాచి ఉంచుతా అంది చిన్ని. అమాయకంగా అన్నా ఆ మాట లోతుగా గునపం లా గుచ్చుకుంది చిన్ని అమ్మ నాన్నకి.
కథనం లో కీలకం :
ఉద్యోగాలంటూ, కెరీర్ అంటూ పట్టణాలకు, అక్కడ నుండి విదేశాలకు పయనమై పోతున్నారు నేటి యువత. పిల్లలు లేని ఇంట్లో ఒంటరి పోరాటం చేస్తూ ఎదురు చూపులోనే గడిచి పోతుంది వృద్ధాప్యం. చివరి చూపుకు కూడా నోచుకోలేని, దూరమైనా దగ్గరి ప్రేమ ఆ పిల్లలది. వీడియో కాల్ పరామర్శలు, ఆడియో కాల్ ఆప్యాయతలు తప్ప మనసుని తాకేలా ఏమి లేవు.
నానమ్మ, తాతయ్యల సన్నిధిలో గడిపే క్షణాలు పిల్లల చిన్ననాటి జీవితంలో అమూల్యమైన ఆభరణాలు. ఆ ప్రేమలో, ఆ జాగ్రత్తలో, ఆ ముద్దులో ఒక ప్రత్యేకమైన తీయదనం దాగి ఉంటుంది. కానీ ఈరోజు కాలం మారింది. చిన్న కుటుంబాలు, ఉద్యోగాల కోసం వేరే వేరే చోట్ల ఉండాల్సిన పరిస్థితులు ఇవన్నీ కలిసి ఆ బంధాన్ని కొంత దూరం చేశాయి. అయినప్పటికీ, తల్లిదండ్రుల చిన్న ప్రయత్నం పిల్లలకు ఆ అనుబంధాన్ని చేరవేయగలదు.
అమ్మమ్మ తాతయ్య అవసరమే :
రోజువారీ పనుల్లో తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా, సెలవు రోజుల్లో మాత్రం పిల్లల్ని నానమ్మ, తాతయ్యల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లతో గడిపేలా చూడాలి. ఆ క్షణాలు పిల్లలకి ఆనందాన్ని, పెద్దలకు కొత్త ఊపిరిని ఇస్తాయి. పిల్లలతో కాసేపు గడిపితే పెద్దలు వృద్ధాప్యాన్ని మరచి చిన్న పిల్లల్లా ఆడిపాడుతారు. ఆ నవ్వులు, ఆ సరదా అందరికీ ఓ మధురమైన జ్ఞాపకమై మిగులుతుంది. సెలవు రోజుల్లో కలుసుకోవడం సాధ్యం కాకపోయినా, కనీసం వారానికి రెండు రోజులు అయినా ఫోన్లో మాట్లాడించే అలవాటు చేయాలి. మీరు వెళ్లలేకపోతే, వాళ్లే ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తే ఆ బంధం ఎప్పటికీ తగ్గిపోదు. పెద్దలతో గడిపే ప్రతి క్షణం పిల్లల హృదయంలో ఒక అమూల్యమైన ఖజానాగా నిలుస్తుంది.
అమ్మమ్మలు, నానమ్మలు ‘మా చిన్నప్పుడు మేము ఇలా ఉండేవాళ్లం’ అని చెప్పినప్పుడు పిల్లలు ఆశ్చర్యంతో వింటారు. ఒక్క వినడమే కాదు, రకరకాల ప్రశ్నలు కూడా వేస్తారు. ఇలా వాళ్ల మెదడు చురుకుగా మారుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా వాళ్లు ఆలోచించే విధానం కొత్త దిశలోకి వెళ్లుతుంది. అదే సమయంలో పెద్దల ప్రేమ విలువ కూడా తెలుసుకుంటారు. పెద్దలలో ఉన్న పాట పాడే నైపుణ్యం, బొమ్మలు గీయడం వంటి అలవాట్లు పిల్లలకూ సంక్రమిస్తే వాళ్లలో క్రియేటివిటీ పుట్టుకొస్తుంది.
కొన్నిసార్లు పిల్లలు అమ్మానాన్నలతోనే కాకుండా నానమ్మ, తాతయ్యలతో కలిసి నిద్రపోవడం కూడా చాలా బాగుంటుంది. రాత్రిపూట కథలు వినడం, సరదా ముచ్చట్లు పంచుకోవడం వాళ్ల బంధాన్ని మరింత బలపరుస్తుంది. అప్పుడప్పుడు వాళ్లతో కలిసి బయటకి వెళ్లి షాపింగ్ చేయడం, పార్క్లో నడవడం, ఆటలు ఆడడం వంటి క్షణాలు పిల్లల చిన్ననాటి జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. వీలైనప్పుడల్లా కుటుంబం మొత్తాన్ని కలిపే రీయూనియన్స్ పెట్టాలి. అలా చేస్తే పిల్లలు బంధువులెవరు ఎవరు అనే విషయం క్లియర్గా తెలుసుకుంటారు. “కుటుంబం అంటే ఏమిటి?” అనే విలువ వారిలో సహజంగానే పెరుగుతుంది. తోటి వయసు పిల్లలతో ఆడుకునే అవకాశం కూడా వారికి లభిస్తుంది.
పెద్దవాళ్లతో చిన్న చిన్న ఆటలు ఆడించడం మరో అందమైన మార్గం. పిల్లలు కొత్త ఆటలు నేర్పుతారు, పెద్దలు పాతకాలపు ఆటలు చూపిస్తారు. ఇలా కలిసి ఆడుకోవడం వల్ల నవ్వులు పూస్తాయి, హృదయం హాయిగా మారుతుంది. ఎప్పుడైనా కలిసే వీలు లేకపోతే వీడియో కాల్స్ చేయడం మర్చిపోవద్దు. స్క్రీన్ టైమ్ పెరుగుతుందేమో అనిపించినా, ఒక లిమిట్ పెట్టుకుంటే అది అసలు సమస్య కాదు. అంతకుమించి, వీడియో కాల్లో ముద్దుగా మాట్లాడటం వల్ల పిల్లలకు పెద్దలపై అనుబంధం పెరుగుతుంది. మరోవైపు, పెద్దవాళ్లకు కూడా “మనవళ్లు మనవరాళ్లు ఎప్పుడూ మనతోనే ఉన్నారు” అనే సంతోషం లభిస్తుంది. ఒంటరితనం మసకబారిపోతుంది.
మొత్తానికి, పిల్లలు నానమ్మ, తాతయ్యల బంధం ఒక జీవితకాల బహుమతి. ఆ బంధాన్ని కాపాడటం తల్లిదండ్రుల కర్తవ్యమే. పిల్లల బాల్యాన్ని అందంగా, పెద్దల వృద్ధాప్యాన్ని ఆనందంగా మార్చేది ఈ మమకారమే.
