Let's talk: editor@tmv.in
మా భవిష్యత్ ఏంటి మహాప్రభో!

మా భవిష్యత్ ఏంటి మహాప్రభో!

T Venkata Ramana
12 సెప్టెంబర్, 2025

ఒకవైపు ఉప ఎన్నిక వేడితో తెలంగాణ రాజకీయం రగులుతుంటే మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. అధికారం మారగానే ‘సేఫ్ జోన్’ కోసం అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు అగ్నిపరీక్షగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆ వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులతో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు అధికార, విపక్షాల వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెట్టగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యేల గుబులు

సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు సమీపిస్తుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వాలనే దానిపై న్యాయనిపుణులతో మల్లగుల్లాలు పడుతున్నారు. వీరిలో ఎవరికి వారు భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తుండటం గమనార్హం.

దేనికైనా సిద్ధం

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు "దేనికైనా సిద్ధం" అంటూ సవాల్ విసురుతుంటే, మరికొందరు మౌనం వహించి ఏం జరుగుతుందో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని వాదిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ వివరణలు సమర్పించినట్లు సమాచారం.

ఆయనే ఆధారం

ఈ రాజకీయ చదరంగంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలనే బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. "పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు" అని మహేష్ గౌడ్ స్వయంగా అంగీకరించిన వీడియో క్లిప్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తూ ఇదే తిరుగులేని సాక్ష్యమని వాదిస్తున్నారు. స్పీకర్ ముందు అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా ఈ వీడియోను ప్రవేశపెట్టి ఫిరాయింపుల బండారాన్ని బయటపెడతామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీ నుంచి గెలిచి ప్రజాతీర్పును అవమానించిన వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ వ్యూహాలు

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నేతలు సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలి అనర్హత వేటు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ న్యాయ నిపుణులతో కలిసి వ్యూహరచన చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలలో తీవ్ర ఆందోళన నెలకొంది. "మా భవిష్యత్ ఏంటి మహాప్రభో" అంటూ వారు అంతర్గత సమావేశాల్లో సీఎం వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే భయం వారిని వెంటాడుతోంది.

చట్టం ఏం చెబుతోంది?

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యులు పార్టీ వీడితే వారిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే పార్టీలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు మరో పార్టీలో విలీనమైతే ఈ చట్టం వర్తించదు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆ పార్టీ శాసనసభా పక్షంలో మూడింట రెండొంతుల కంటే చాలా తక్కువ. ఇదే బీఆర్ఎస్కు కొండంత బలంగా మారింది. ఈ అనర్హత వ్యవహారం రానున్న ఉప ఎన్నికలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తెలంగాణలో మరో 10 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఇది అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారనుంది. ఇప్పటికే జరుగుతున్న ఉప ఎన్నికల హడావుడికి తోడు ఈ మినీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని బీఆర్ఎస్ భావిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని చూస్తోంది. మొత్తంమీద స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? న్యాయపోరాటం ఏ మలుపు తీసుకుంటుంది? ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు తీర్పు ఏంటి?

తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారి అనర్హతపై శాసనసభ స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టేసింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టే అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఏ ఎమ్మెల్యే అయినా ఈ ప్రక్రియను పొడిగించాలని స్పీకర్ను అడగకూడదని అలా చేస్తే స్పీకర్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఫిరాయింపులపై సుప్రీం అసహనం

అయితే ఇలాంటి పార్టీ ఫిరాయింపుల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని వీటిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించినట్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 136, 226, 227 ఆర్టికల్స్లో న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని గుర్తు చేసింది.

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు

దానం నాగేందర్ - ఖైరతాబాద్ ఎమ్మెల్యే

తెల్లం వెంకట్రావు - భద్రాచలం ఎమ్మెల్యే

కడియం శ్రీహరి - స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే

పోచారం శ్రీనివాస్రెడ్డి - బాన్సువాడ ఎమ్మెల్యే

అరికెపూడి గాంధీ - శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

కాలె యాదయ్య - చేవేళ్ల ఎమ్మెల్యే

బండ్ల క్రిష్ణమోహన్రెడ్డి - గద్వాల్ ఎమ్మెల్యే

గూడెం మహిపాల్రెడ్డి - పటాన్చెరు ఎమ్మెల్యే

ఎం.సంజయ్ కుమార్ - జగిత్యాల ఎమ్మెల్యే

ప్రకాశ్ గౌడ్ - రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

మా భవిష్యత్ ఏంటి మహాప్రభో! - Tholi Paluku