
వామపక్ష భావజాలాన్ని నిలబెట్టాలి!
దేశంలో నేడు ఆర్ఎస్ఎస్ నయా ఫాసిస్టు స్వభావంతో పోరాటాలను అణచాలని చూస్తుందని, అలాంటి ఆలోచనలున్న గూండాల గుంపును పోగేసుకుని కర్కశంగా, నేరపూరితంగా వ్యవహరించాలని చూస్తుందని, దీనికి విరుగుడుగా వామపక్ష శక్తులన్నిటినీ కలుపుకొని వామపక్ష భావజాలాన్ని నిలబెట్టడమే ఏచూరికి నిజమైన నివాళి అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఉద్ఘాటించారు. విశాఖ నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నూతనంగా నిర్మితమైన సీపీఎం విశాఖపట్నం జిల్లా కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. కార్యాలయానికి సీతారాం ఏచూరి భవన్ అని పేరు పెట్టారు.
ఏచూరిని తలచుకొని భావోద్వేగం
ఈ సందర్భంగా సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షత వహించిన ఈ సభలో బేబీ మాట్లాడుతూ ఏచూరితో 45 ఏళ్ల అనుబంధం, అనుభవాలను పంచుకున్నారు. ఏచూరి చనిపోయి ఏడాదవుతుందంటే వినడానికి కష్టంగా బాధగా ఉందన్నారు. 1979 పాట్నాలో జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు జరిగినప్పుడు ఆలిండియా బాధ్యతల్లోకి ఇద్దరం వచ్చామని గుర్తు చేసుకున్నారు. 45 సంవత్సరాలు కలసి పని చేశాం. విస్తృతంగా దేశ, విదేశాల్లో పర్యటనలు చేశాం. 2017 అక్టోబర్ విప్లవం శత విజయోత్సవం సందర్భంగా మాస్కో వెళ్లాం. లెనిన్ పార్థివ దేహాన్ని సందర్శించాం. మేం పర్యటనలు చేసేటప్పుడు పలుమార్లు రైళ్లలో రిజర్వేషన్లు లేనప్పుడు పేపర్లు కిందన వేసుకుని వెళ్లేవాళ్లం.. అంటూ సభా వేదికపై ఉద్వేగానికి గురయ్యారు. దేశంలో సామాజిక, ఆర్థిక పోరాటాలు ఈ దేశం, దేశంలోని పీడిత ప్రజలు, ఆదివాసీలు, వ్యవసాయ కార్మికుల విషయంలో వామపక్ష దృక్పథం గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఆలోచనా దృక్పథంలో ఏచూరి అగ్రగణ్యులని కొనియాడారు. ఎక్కడ కార్మికులుంటే అక్కడ, ఎక్కడ కులవివక్షత ఉంటే అక్కడ ఎర్రజెండా ఉండాలని బేబీ అన్నారు. వర్గపోరాటాలు, కార్మిక పోరాటాలను వామపక్ష శక్తులు నిర్వహించాలని సుందరయ్య, బిటిఆర్, బసవపున్నయ్య, రామ్మూర్తి, జ్యోతిబసు, సూర్జిత్ వంటి నేతలంతా చెప్పారని, ఈ ఆలోచనలను పుణికిపుచ్చుకున్న వారిలో సీతారాంఏచూరి ఒకరని చెప్పారు.
ఉద్యమాల కేంద్రంగా విశాఖ
ఏచూరిని గుర్తు చేసుకోవడమంటే పోరాటాలను గుర్తు చేసుకోవడమేని బేబీ అన్నారు. ఆయన పేరుమీద జిల్లా కార్యాలయం ఇంత ఆధునికంగా నిర్మించడాన్ని పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేసారు. విశాఖలో అల్లూరి విజ్ఞాన కేంద్రంగా కూడా నిర్మించి సాంస్కృతిక, సైద్ధాంతిక రంగంలో సోషలిస్టు భావజాలాన్ని విస్తృతపరచడంతో పార్టీ ఆఫీస్లు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ప్రశసించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఇది కొత్త సమాజం కోసం నిర్మించుకున్న పోరాట కేంద్రం’..పీడిత ప్రజలు తమ కష్టాలు చెప్పుకుంటే తగిన పోరాడే శక్తిని పొందే నిలయమన్నారు. ఏచూరి స్ఫూర్తితో ఏర్పాటైన ఈ భవన్ విశాఖ జిల్లా సీపీఎం పార్టీకి ఉద్యమాల కేంద్రంగా విలసిల్లాలన్నారు. ‘2024 అక్టోబర్ 7న ఈ భవనానికి శంఖుస్థాపన స్థానిక నాయకత్వం చేసిందని, ఏచూరి ప్రథమ వర్థంతి లోపే పూర్తిచేస్తామని చెప్పి అలా పూర్తిచేసి కమ్యూనిస్టు స్ఫూర్తిని ప్రదర్శించారని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ నాయకులను అభినందిస్తూ నాయకుల సోషలిస్టు స్ఫూర్తికి నిలువుటద్దమని కొనియాడారు.
ఈ సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, కె.లోకనాధం, పార్టీ సీనియర్ నాయకులు సి.హెచ్.నరసింగరావులు విశాఖ ఉద్యమాల్లో వారికుండే అనుభవాలను తెలిపారు. సీతారాం ఏచూరి వ్రాసిన వ్యాసాలతో కూడిన పుస్తకం పరిచయం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ మాట్లాడారు. వామపక్ష పార్టీల నాయకులు చంద్రశేఖర్, ఎం.వెంకటేశ్వర్లు, దేవా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, బి.పద్మ, పి.మణి, విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పాడేరు జిల్లా కార్యదర్శి అప్పలనర్స, సరేంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు సి.హెచ్ నరసింగరావు జెండావిష్కరణ చేపట్టారు.
అనంతరం ఎంఏ బేబి ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎంఏ బేబి ప్రారంభించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. మీటింగ్ హాల్, గ్రంధాలయం, జిల్లా కార్యాలయం, కుట్టుమిషన్ కేంద్రం, ఆరోగ్యం కేంద్రం రూము, కాన్ఫెరెన్స్ హాల్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్రకమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, కె.లోకనాధం, నర్సింగరావు, శర్మ, అజయ్శర్మ, భాగ్యలక్ష్మి, ఎన్.రామారావు, ఎస్.సుధాకర్, జివిఎన్ చలపతి, పి.వెంకటరెడ్డి, ఎస్.జ్యోతీశ్వరరావు, సూర్యచంద్రరావు, త్రినాధ్ తదితరులు ప్రారంభించారు. మోడీ వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించినప్పుడు సీతారాం ఏచూరి విశాఖ స్టీల్సభలో ప్రసంగించిన ఫోటో చూశానన్నారు. నాడు ఎర్రజెండాలన్నీ పోరాటంలోకి దిగివచ్చాయని బేబీ కొనియాడారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం వచ్చాక ఏర్పాటు చేసుకున్నామని అవి ప్రజల ఆస్థులన్నారు. ఏచూరి సంస్మరణ సందర్భంగా స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
