
అప్పన్న ఆలయంలోని ఆభరణాలకు ఆపద!
దేవుడి సొమ్ముకు రక్షణ కరువైంది. సింహాచలం దేవాలయ పరిస్థితి అంతే. సింహాద్రి అప్పన్న దేవస్థానం పరిధిలోని పలు ఉపాలయాల్లో కొన్ని ఆభరణాలు ఏమయ్యాయో తెలియడం లేదని, ఈ విషయమై విచారణ జరిపించాలంటూ కడప జిల్లాకు చెందిన కొండోజు ప్రభాకర ఆచారి అనే భక్తుడు దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయట పడింది. దేవస్థానం నిర్వాహణలోనూ లోపాలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ నిర్లక్ష్యంపై నివేదిక వచ్చినా ఇప్పటి వరకూ కనీస చర్యల్లేవని భక్తులు మండిపడుతున్నారు.
నివేదికలో ఏముంది?
సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై నివేదిక అందగా కొన్ని బంగారు ఆభరణాల బరువు తగ్గినట్టు తేలింది. అంతేకాకుండా దేవస్థానానికి చెందిన ఉపాలయాల్లో 16 వెండి వస్తువుల్ని గుర్తించామని, వాటి వివరాలు ఎక్కడా నమోదు చేయలేదని నివేదిక అందజేసిన కమటీ సభ్యులు సైతం స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామికి 111.38 గ్రాముల బంగారు ముత్యాలహారం ఉండాలనే విషయం రిజిస్టర్లో నమోదు చేసి ఉండగా, ఆలయంలో 36 గ్రాముల బంగారు గొలుసు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా సింహాచలం ఆలయానికి అన్ని తానై వ్యవహరిస్తున్న గోవా గవర్నర్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారో చూడాల్సిందే. అయితే కొందరు అధికారులు ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
