
ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్లు రద్దు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, ఇతర డిమాండ్ల సాధనకై గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుండి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ, ‘కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయడానికి రెండేళ్లు పట్టింది. బుధవారం ముఖ్యమంత్రి అనంతపురం సభలో డ్రైవర్లకు రూ.15,000 ఇస్తున్నట్టు ప్రకటిస్తూ, ఈ పథకం పొందాలంటే ప్రతి డ్రైవర్కి బ్యాడ్జి ఉండాలని తదితర షరతులు పెట్టడం దారుణం’ అని అన్నారు.
గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం డ్రైవర్లకు ఉండే బ్యాడ్జి నెంబర్లను రద్దు చేసిందన్న విషయం గుర్తించాలని, వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని పడాల రమణ అన్నారు. ఆటో డ్రైవర్ల పీకమీద కత్తిలా ఉన్న బహుళ జాతి కంపెనీలకు చెందినటువంటి ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలకు టూవీలర్లపై మనుషులను రవాణా చేసే అనుమతులను ఇతర రాష్ట్రాల్లో రద్దు చేసినప్పటికీ, మన రాష్ట్రంలో ప్రభుత్వం వాటిని రద్దు చేయకుండా కొనసాగించడం వల్ల ఇటు డ్రైవర్లకు అటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని, వెంటనే ప్రభుత్వం టూవీలర్లకు యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో మోటార్ కార్మికుల వచ్చే ఆదాయం 80 శాతం దాకా తగ్గి పోయిందని పడాల రమణ అన్నారు. వచ్చే ఆదాయంతో ఇంటి అవసరాలు పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు చార్జీలు, ఇంటి అద్దెలు చెల్లించుకోలేని దీనస్థితిలో ఆటో మోటార్ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ‘ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబరు 21, 31లను తీసుకువచ్చి వేలాది రూపాయల అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోపక్క టూ వీలర్లకు ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల ద్వారా అనుమతులు ఇవ్వడం వలన డ్రైవర్ల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. బ్రతకడమే భారంగా ఉన్న డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబాలను పోషించుకోలేక చావు తప్ప దారి లేదనే భావన కలుగుతోంది. కనుక వెంటనే ఈ యాప్లు రద్దు చేయాలి’ అని కోరారు.
ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ, ‘ములిగే నక్కపై తాటిపండు పడినట్టు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు విధిస్తున్న అధిక వడ్డీ అక్రమ ఓడీలతో కట్టవలసి వస్తోంది. ఇలా దినదిన గండం-నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు జీవిస్తున్న ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లపై రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడంతో మరింత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా రూ.15,000 డ్రైవర్ల ఖాతాలో జమ చేయాలని కోరుతున్నాం’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పెట్రోలు, డీజిల్, సిఎన్జి గ్యాస్లలో 50 శాతం రాయితీతో ఇంధనం అందించాలని డిమాండ్ చేశారు.
‘పోలీస్, ఆర్టిఏ అధికారులు పెడుతున్న ఈ చలానా కేసులను ఎత్తివేయాలి. మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి. ఏ డ్రైవర్ అయినా ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి’ అని అన్నారు. వేలాది మంది ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, డ్రైవర్ జీవన పరిస్థితులు మెరుగయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ నాయకులు ఎన్ మధు రెడ్డి, అడ్డూరి శంకర్, లండ అప్పారావు, దల్లి నాని, లంకా గోవింద్ సూరిబాబు, కెల్లా రమణ, సింహాచలం, భాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
