Let's talk: editor@tmv.in
ప్రపంచ రికార్డుకు సిద్ధమైన బతుకమ్మ

ప్రపంచ రికార్డుకు సిద్ధమైన బతుకమ్మ

T Venkata Ramana
12 సెప్టెంబర్, 2025

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక పూల పండుగ బతుకమ్మ. ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా 10వేల మంది ఆడపడుచులతో బతుకమ్మ వేడుకను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని అధికారులు సంకల్పించారు. ఈనెల 28న పదివేల మందికి పైగా మహిళలతో బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు.

2016లో గిన్నిస్ బుక్ కోసం చేసిన ప్రయత్నం భారీ వర్షం కారణంగా ఫలించకపోయినా ఈసారి పటిష్టమైన ప్రణాళికతో, పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నామని జీహెచ్ఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో పట్టణ సామాజికాభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ ఎస్. పంకజ నేతృత్వంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న చరిత్ర, విశిష్టత ఏముంది.

ఏమిటీ బతుకమ్మ? ఎందుకీ వేడుక?

బతుకమ్మ అంటే కేవలం పూలతో చేసే అలంకారం కాదు. అదొక జీవన వేదం. "బతుకు అమ్మ" అని పిలుస్తూ తమ జీవితాలను చల్లగా చూడమని ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను వేడుకునే అద్భుతమైన పండుగ ఇది. ఇది తెలంగాణ నేల, నీరు, పువ్వులకు సంబంధించిన పండుగ. మహిళలందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ వేడుక, సామాజిక ఐక్యతకు, సమిష్టి జీవన సౌందర్యానికి దర్పణం పడుతుంది. భాద్రపద అమావాస్య రోజున 'ఎంగిలిపూల బతుకమ్మ'తో ప్రారంభమై, దుర్గాష్టమి నాడు 'సద్దుల బతుకమ్మ'తో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధి ఆడపడుచుల పాటలతో, చప్పట్లతో మార్మోగిపోతుంది.

బతుకమ్మ విశిష్టత

బతుకమ్మ తయారీలోనే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి కనిపిస్తుంది. గునుగు, తంగేడు, బంతి, చామంతి, కట్ల పూలు వంటి తీరొక్క పూలను సేకరించి, రాగి తాంబాలంలో వలయాకారంగా పేరుస్తారు. మధ్యలో పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి, అగరొత్తులతో, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. సాయంత్రం వేళ, ఆడపడుచులంతా ఒకచోట చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ చప్పట్లతో గౌరమ్మను కీర్తిస్తారు.ఒక్కేసి పువ్వేసి చందమామ... చిత్తూ చిత్తుల బొమ్మ శివుడా ముద్దుల గుమ్మ...రామ రామ ఉయ్యాలో... వంటి పాటలు తెలంగాణ జానపద సంస్కృతికి జీవనాధారాలు. ఈ పాటల్లో పురాణ గాథలు, కుటుంబ సంబంధాలు, సామాజిక అంశాలు, మహిళల కష్టసుఖాలు అన్నీ మిళితమై ఉంటాయి. ఆ తర్వాత బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి దగ్గరలోని చెరువులో, నదిలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల పూలలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి నీటిని శుద్ధి చేస్తాయని శాస్త్రీయంగా కూడా నమ్ముతారు.

చారిత్రక నేపథ్యం

బతుకమ్మ వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళ రాజు ధర్మాంగదుడు ఆయన భార్య సత్యవతి అనేక పూజల తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమెకు మహాలక్ష్మి అని పేరు పెట్టారు. అనేక గండాలను దాటుకుని జీవించినందున, ఋషులు ఆమెను "బతుకమ్మా" అని దీవించారని అప్పటి నుంచి ఈ పండుగ మొదలైందని ఒక కథ. మరో కథ ప్రకారం శివుడిని భర్తగా పొందడానికి పార్వతీ దేవి చేసిన తపస్సుకు ప్రతీకగా బతుకమ్మను కొలుస్తారని నమ్ముతారు.కారణం ఏదైనా భూస్వామ్య వ్యవస్థలో గడీల పాలనలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజానికి బతుకమ్మ ఒక సాంస్కృతిక ఊరట. తమ కష్టాలను, బాధలను పాటల రూపంలో గౌరమ్మ ముందు చెప్పుకుని సాంత్వన పొందే ఒక గొప్ప వేదిక ఈ పండుగ.

బతుకమ్మ పునరుజ్జీవం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. ఇది కేవలం పండుగగానే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని, భాషను, యాసను చిన్నచూపు చూస్తున్న తరుణంలో "మా బతుకమ్మ మాకుంది" అంటూ తెలంగాణ ప్రజలు తమ సాంస్కృతిక జెండాను ఎగురవేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మకు రాచమర్యాదలు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వమే ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ ఈ పండుగలో భాగస్వామి అవుతోంది. దసరా పండుగను తెలంగాణ పెద్ద పండుగగా గుర్తించి బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం పాఠశాలలకు సెలవులను పెంచడం కూడా దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. బతుకమ్మ వేడుకలు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు తామున్న దేశంలోనే బతుకమ్మను ఆడుతూ, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లోని గడపలకే పరిమితమైన బతుకమ్మ, నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ లాంఛనాలతో, ప్రపంచ వేదికలపై కీర్తి ప్రతిష్టలు అందుకుంటోంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ తలపెట్టిన ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం కేవలం ఒక సంఖ్య కోసం కాదు. తెలంగాణ సంస్కృతిని, మహిళల ఐక్యతను, ప్రకృతి ఆరాధన తత్వాన్ని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పే ఒక చారిత్రక ఘట్టం. ఈ ప్రయత్నం విజయవంతమై, తెలంగాణ కీర్తి పతాకం మరోసారి విశ్వవేదికపై రెపరెపలాడాలి.

చురుకుగా ఏర్పాట్లు

జీహెచ్ఎంసీ తరఫున ఆరు వేల మందిని సమీకరిస్తున్నారు. మెప్మా, సెర్ప్లు శివారు జిల్లాల నుంచి మరో నాలుగు వేల మందికి తగ్గకుండా సమీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. వారందరికీ ఈ నెల 27న శిక్షణ ఇచ్, 28న ఎల్బీ స్టేడియంలో పదివేలమందికి పైగా మహిళలతో బతుకమ్మ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుక కోసం తీరొక్క పూలతో 52 అడుగుల బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహించేందుకు వేర్వేరు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 22వ తేదీ నుంచి 26 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 26 వరకు దేవాలయాలు, వారసత్వ కట్టడాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.

27న కార్నివాల్

హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్పై 27న హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహిస్తారు. తెలంగాణ పిండి వంటకాలు, ఇతరత్రా తినుబండారాలు, ఆహార పదార్థాల ప్రదర్శన, వాటి విక్రయ కేంద్రాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

29న బతుకమ్మ పోటీలు

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు, మహిళా బైక్ రైడర్స్తో సమావేశాలు నిర్వహిస్తారు. 30వతేదీని సచివాలయం ముందున్న అమరవీరుల స్తూపం నుంచి వందల మంది మహిళలు ట్యాంక్బండ్పై బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మ ఆడుతూ ర్యాలీగా వెళ్తారు. తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ గురించి ప్రపంచాన్ని ఆకర్షించేలా ఓ కార్నివాల్ తరహాలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు పర్యటకశాఖ మంత్రి జూపల్లి కృష్టారావు వెల్లడించారు. బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నివసించే తెలంగాణ వాసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ప్రపంచ రికార్డుకు సిద్ధమైన బతుకమ్మ - Tholi Paluku