Let's talk: editor@tmv.in
సమకాలీన రాజకీయాలపై

సమకాలీన రాజకీయాలపై

Dr.Chokka Lingam
12 సెప్టెంబర్, 2025

సోషల్ మీడియా. ఈ పదం లేకుండా ఇప్పుడు రోజు గడవడం లేదు. అందరి జీవితాలూ, రాజకీయాలు, సంపాదన అంతా సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతోంది. అసలు సోషల్ మీడియాలేని కాలంలో జనం ఎలా ఉండేవారో అనిపిస్తుంది. ఆనందం కోసమో, కాసేపు టైం పాస్ కోసమో, ఒత్తిడి తగ్గించుకోడానికో, చైతన్యానికో, జ్ఞానం పెంచుకోడానికో, షేరింగ్కో యువతతో పాటు మధ్యవయస్కులు సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతున్నారు. ప్రజల ఈ వ్యవహారశైలే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను శాసిస్తోంది. వాయువేగంతో సమాచార వ్యాప్తి జరుగుతుండడం రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమవుతోంది. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్లో ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి ప్రభుత్వాలు క్షణాల్లో కుప్పకూలడానికి వందకు వందశాతం కారణం సోషల్ మీడియానే. ఫోన్లు చేతుల్లో పట్టుకుని గంటల సమయం సోషల్ మీడియాలో మునిగి తేలుతూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని, పనిగంటలు కోల్పోయి దేశానికి నష్టం జరుగుతోందని యువతపై మేథావులు పలు ఆరోపణలు చేస్తుంటారు. కానీ నిజానికి సోషల్ మీడియా వల్ల ఎంత చెడు జరుగుతోందో అంత మంచి కూడా జరుగుతోంది.

భారత్లోనూ పలు ప్రజా ఉద్యమాలకు సోషల్ మీడియానే కారణం. కరోనాకు ముందు కాలంలో సీఏఏ నిరసనలు, తర్వాత రైతుల ఉద్యమం, కర్ణాటకలో హిజాబ్ ఉద్యమం ఇలా అనేక ఆందోళనలు సోషల్ మీడియా వల్ల జరిగినవే. ఇంత విస్తృతంగా లేకపోయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలోనూ సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది.

నిరసనల సంగతి పక్కన పెడితే విధానాల రూపకల్పనకు, ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయపార్టీలకు సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా మారింది. సోషల్ మీడియాను మేనేజ్ చేస్తే ప్రజాభిప్రాయాన్ని మార్చేసినట్టే అన్న అభిప్రాయంలోకి రాజకీయ పార్టీలు వెళ్లిపోయాయి. సామాజిక మాధ్యమాల ప్రచారంతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. రాజకీయపార్టీల పోల్ మేనేజ్మెంట్లో సోషల్ మీడియా మేనేజ్ మెంట్ కీలకంగా మారింది. పెద్దగా జనాలకు తెలియని నేతలు కూడా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వంటివాటి పుణ్యంతో రాత్రికి రాత్రే అమాంతంగా ఆదరణ పెంచుకుంటున్నారు. భారత్లో ఇప్పుడు ఎన్నికలంటే అసలు ప్రచారం కన్నా సోషల్ మీడియా ప్రచారాంశాల కోసమే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

పార్టీల, వ్యక్తిగత సోషల్ మీడియా ఎకౌంట్లలో ఏం జరుగుతోంది...తాము చెప్పాలనుకున్నది జనాలకు చేరుతోందా? ప్రజలెలా అర్ధం చేసుకుంటున్నారు..? ఎంతమంది తమను ఫాలో అవుతున్నారు? ఏ అభిప్రాయంతో ఉన్నారు. ఓటర్లలో సానుకూల అభిప్రాయం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? అంతా సానుకూల ప్రచారం ఎలా చేయించుకోవాలి వంటివాటిపై నేతల దృష్టి ఉంటోంది. ఇప్పుడు సామాజిక, రాజకీయ చైతన్యానికి సోషల్ మీడియానే ఆయువుపట్టు. భారత్లో మాత్రమే కాదు

ప్రపంచవ్యాప్తంగానూ రాజకీయాలకు సోషల్ మీడియానే కేంద్రబిందువుగా మారింది. 2020 ఎన్నికల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి అంతకు కొన్ని నెలల ముందు జరిగిన ఐ కాంట్ బ్రీత్, బ్లాక్ లివ్స్ మ్యాటర్ ఉద్యమం. నల్లజాతికి చెందిన జార్జ్ఫ్లాయిడ్ను శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి కాలు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసిన ఘటన అమెరికా సమాజంలో ఆగ్రహావేశాలను పెల్లుబికేలా చేసింది. సోషల్ మీడియా ద్వారానే ఉద్యమవ్యాప్తి జరిగింది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో రాజకీయంగా మార్పులకు సోషల్ మీడియా ఉద్యమాలు దారితీస్తున్నాయి. యువత భారీగా వీధులోకొస్తున్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలకు, నిరుద్యోగానికి, అవినీతికి, రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పడుతున్నారు. మన పొరుగుదేశాలే దీనికి ఉదాహరణ.

కొన్నేళ్ల క్రితం దివాళా తీసిన శ్రీలంక ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. దేశం దివాళా తీయడానికి కారణమైనవారిని ప్రజలు ఊరికినే వదిలిపెట్టలేదు. 2019 తర్వాత శ్రీలంకలో అర్థిక సంక్షోభం తీవ్రమైంది. విదేశీ రుణాలు పెరిగిపోయాయి. సేంద్రీయ ఎరువులు తప్ప మరేమీ వాడొద్దన్న ప్రభుత్వ నిర్ణయం శ్రీలంక ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ద్రవ్యోల్బణం అదుపుతప్పి ప్రజల జీవితాలు చెల్లాచెదురయ్యాయి. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోటా గో హోమ్ పేరుతో భారీ ఉద్యమం చేపట్టారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్సేను గద్దెదించారు. అధ్యక్షభవనంలోకి ప్రజలు చొచ్చుకుపోవడం, అధ్యక్షుడు, ఆయన తమ్ముడు అప్పటి ప్రధాని మహేంద్ర రాజపక్సే దేశం విడిచి వెళ్లాల్సిరావడం, ఆయన కుటుంబంలోని మంత్రులందరూ రాజీనామా చేయాల్సిరావడం ప్రజా ఉద్యమాల ఫలితాన్ని ఆధునికకాలంలో ప్రపంచానికి రుచిచూపింది. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలతో ప్రజలు ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొంది, లాఠీ దెబ్బలకు, జైలు శిక్షలకు భయపడకుండా వీధుల్లోకొచ్చి రాత్రీ, పగలూ తేడాలేకుండా పోరాటాలు జరిపి అనుకున్నది సాధించారు. మొదట మామూలుగా ఉన్న ఆందోళన సోషల్ మీడియా ప్రభావం వల్లే కొన్నిరోజులకే ఉధృత రూపు దాల్చి భారీ ఉద్యమం అయింది. అలా శ్రీలంక ప్రజలు తమ జీవితాలను తాము మెరుగుపర్చుకోవడానికి సోషల్ మీడియా కారణమైంది.

గత ఏడాది జరిగిన బంగ్లాదేశ్లోని ఉద్యమమూ అంతే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫ్రీడమ్ ఫైటర్ల వంశీయులకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదట విద్యార్థుల చిన్నస్థాయి మొదలైన ప్రదర్శనలతో మొదలైన ఆందోళన తర్వాత ఊహించని స్థాయిలో బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసింది. అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అకస్మాత్తుగా రాజీనామా చేసి దేశం వీడాల్సి వచ్చింది. ఆందోళనకారులను ఏకతాటిపైకి తీసుకురావడంలో, అల్లర్లు దేశమంతా విస్తరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర.

ఇక నేపాల్ విషయానికొస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా ఏదన్నా విషయంలో ఆందోళన మొదలైతే ముందుగా ఇంటర్నెట్పై, సోషల్ మీడియాపై నిషేధం విధిస్తారు. దీనికి కారణం నిరసనల గురించి ఎక్కువమందికి తెలియకుండా ఉండడానికి. అవి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి. కానీ నేపాల్లో పరిస్థితి భిన్నం. అసలు ఆందోళనలు మొదలయిందే సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా. జెన్ జెడ్ నడుపుతున్న ఈ ఉద్యమం మొదట సోషల్ మీడియా లేదన్న అసంతృప్తితో మొదలయినప్పటికీ అసలు కారణం రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, నిరుద్యోగం పెరిగిపోవడం. అందుకే ఆందోళనలు మొదలయినవెంటనే ప్రభుత్వం హుటాహుటిన మేల్కొని సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ప్రజాగ్రహం చల్లారలేదు సరికదా మరింతగా పెరిగింది.

ప్రధాని, మంత్రులు రాజీనామా చేసిన తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. సోషల్ మీడియా వల్ల భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడం బాగా పెరిగింది. మనలాగే అందరూ ఆలోచిస్తున్నారన్న భావన కొత్త ఉత్సాహాన్ని, దేన్నయినా సాధించుకోగలమన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నేపాల్లో జరుగుతోంది, అంతకుముందు అనేక దేశాల్లో జరిగింది ఇదే. రాజకీయ నాయకులు నియంత్రణలో ఉండడానికి, పార్టీలు కట్టుబాట్లు తప్పకుండా ఉండడానికి సోషల్ మీడియా నిరంతరం పర్యవేక్షణే కారణం.

సమకాలీన రాజకీయాలపై - Tholi Paluku