
తప్పిన పెను ప్రమాదం
వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లక్నోలో, హర్దోయ్ జిల్లాలో ఇటీవల రైలు ప్రమాదాలు జరిగాయి. ఎటువంటి ప్రాణం నష్టం జరగనప్పటికీ ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు మరింత భద్రతా చర్యలు చేపట్టే అవసరాన్ని సూచిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పూర్ణియా వెళుతున్న ప్రత్యేక రైలు ఘజియాబాద్ జిల్లాలోని సాహిబాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా లేగేజీ కోచ్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళన చెందారు.
దట్టంగా వ్యాపించిన మంటలు
లగేజ్ కోచ్ లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో, చుట్టుపక్కల దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు మరింత ఆందోళన చెందారు. కొంతమంది రైలుదిగి పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటహుటిన తరలివచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన సంబంధిత లగేజీ కోచ్ ను రైలు నుంచి వేరు చేసి రైలును పూర్ణయా పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మంటలు ఎలా వచ్చాయి. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా? లేకుంటే షార్ట్ సర్క్యూట్ వలన ఈ ఘటన జరిగిందా, సాంకేతిక కారణాల వలన అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంటలు పక్క బోగీలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
