Let's talk: editor@tmv.in
పోలీసుల మీద తిరగబడ్డ రైతులు

పోలీసుల మీద తిరగబడ్డ రైతులు

Aravind Maryada Reddy
12 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో రైతుల ఆగ్రహం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలు అమలు చేసినప్పటికీ తాజాగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్యను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం కాలేకపోతున్నది. నిత్యం ఏదో ఒక చోట అన్నదాతలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రైతులు సిద్దిపేట జిల్లాలో పోలీసుల మీదే తిరగబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రింబవళ్లు పడిగాపులు

గత కొన్ని వారాలుగా, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో యూరియా కొరత కారణంగా రైతులు వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కార్యాలయాల వద్ద రాత్రింబవళ్లు క్యూలలో నిలబడుతున్నారు. నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నారాయణపేట వంటి జిల్లాల్లో రైతులు రోడ్లను అడ్డుకుని, ధర్నాలు చేస్తూ, యూరియా సరఫరా కోసం నినాదాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు రాత్రంతా వర్షంలో తడుస్తూ, ఆకలితో, నీరు లేకుండా యూరియా బస్తాల కోసం వేచి ఉంటున్నారు.

సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలో జరిగిన ఒక ఘటన యూరియా సమస్య ఎంతో తీవ్రంగా ఉందో కండ్లకు కడుతున్నది. యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతును అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, మిగతా రైతులు ఏకమై పోలీసులపై తిరగబడ్డారు. "పోలీస్ గో బ్యాక్" అంటూ నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "ఒక్క యూరియా బస్తా కోసం అన్నం, నీళ్లు లేక తిరుగుతున్నాం. అర్ధరాత్రి పడిగాపులు కాస్తున్నాం," అని రైతులు పోలీసులపై మండిపడ్డారు.

పోలీసు చర్యలు రైతులపై దాడులు

నారాయణపేట జిల్లాలోని తీలేరు గ్రామంలో జరిగిన మరో ఘటనలో, యూరియా కోసం క్యూలో నిలబడిన ఒక రైతును పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అయింది.

ఈ ఘటనపై రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రైతులు పోలీసుల అత్యుత్సాహ చర్యలను, ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. మహబూబాబాద్లో రైతులు ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా రైతులు రోడ్లను అడ్డుకున్నారు. పోలీసులు రైతులను అరెస్టు చేయడం, బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడం వంటి చర్యలు రైతుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకుడు సుంకె రవిశంకర్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పోలీసులతో ఘర్షణలు జరిగాయి, ఇందులో ఒక నాయకుడు గాయపడ్డారు.

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

ఈ సంక్షోభం రాజకీయ రంగంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు (కేటీఆర్) హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా బస్తాలతో ఆందోళన నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించిందని ఆరోపించారు. "కేసీఆర్ పాలనలో 10 ఏళ్లూ యూరియా కొరత లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?" అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు, కాంగ్రెస్ నాయకులు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందని ఆరోపిస్తున్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ఆందోళన చేస్తూ, కేంద్రం తెలంగాణకు యూరియా కేటాయింపులను ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రం 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత

రైతుల ఆందోళనలు, పోలీసు చర్యలు, రాజకీయ ఆరోపణల మధ్య తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక భావనలు తీవ్రమవుతున్నాయి. రైతులు కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ, "ఆ రోజులు బాగుండేవి" అని కన్నీరు పెట్టుకుంటున్నారు. మహబూబాబాద్లో ఒక రైతు, "కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పులతో మమ్మల్ని మేమే కొట్టుకుంటున్నాం," అని వాపోయాడు. ఖరీఫ్ సీజన్లో యూరియా సరఫరా కొరత వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, కేవలం 44,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని అధికారులు చెప్పారు. ఈ పరిస్థితి రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది, దీనితో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. తెలంగాణలో యూరియా సంక్షోభం రైతుల ఆగ్రహాన్ని, ప్రభుత్వ వ్యతిరేక భావనలను మరింత తీవ్రతరం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో, ప్రభుత్వం వారి ఆందోళనలను సీరియస్గా పరిగణించి, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పోలీసుల మీద తిరగబడ్డ రైతులు - Tholi Paluku