
‘ఉగ్రవాద’ అడ్డాగా తెలంగాణ?
రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాద మూలాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే నిజమాబాద్ జిల్లా బోదన్ పట్టణంలో ఐసిసి ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఒక బీ ఫార్మసీ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో తెలంగాణలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు మళ్లీ బయటపడ్డాయి. కేవలం బోధన్లోనే కాకుండా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అరెస్టులు, జాతీయ దర్యాప్తు సంస్థ ఛేదిస్తున్న కుట్రలను పరిశీలిస్తే ఉగ్రవాదులకు, వారి సానుభూతిపరులకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఒక సురక్షిత స్థావరంగా మారుతోందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బోధన్లో ఏం జరిగింది?
నిజామాబాద్ జిల్లా బోధన్లోని అనీసా నగర్కు చెందిన మహమ్మద్ ఉజైఫా యామన్ (21) స్థానికంగా బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ సెల్ పోలీసు బృందం స్థానిక పోలీసుల సహాయంతో ఉజైఫాను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని బోధన్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుకు మూలం జార్ఖండ్లోని రాంచీలో ఇటీవల పట్టుబడిన డానిష్ అనే ఐసిస్ సానుభూతిపరుడు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు బాంబు దాడులకు కుట్ర పన్నుతున్న డానిష్ను విచారించగా ఉజైఫా పేరు బయటపడింది. వీరిద్దరూ ఒక ప్రత్యేకమైన, అత్యంత రహస్యమైన వీడియో కాల్ యాప్ ద్వారా నిరంతరం మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్లోని హ్యాండ్లర్ల నుంచి వీరికి ఆదేశాలు అందుతున్నాయని, దేశంలోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, దాడులకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాలలో వీరు చురుకుగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే తన కుమారుడికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని ఉజైఫా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఎన్నో మూలాలు
బోధన్ ఘటన ఒక మచ్చుతునక మాత్రమే. గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉగ్రవాద సంబంధిత అరెస్టులను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్లో హ్యాండ్ గ్రెనేడ్ల కలకలం జరిగింది. దసరా పండుగ సమయంలో నగరంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా , ఐఎస్ఐ హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుంటున్నట్లు తేలింది. వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, నగదు స్వాధీనం చేసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. జన సమూహాలపై, బీజేపీ, ఆరెస్సెస్ నేతలపై దాడులు చేయడమే వారి లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.దేశవ్యాప్తంగా నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు సంబంధించి నిజామాబాద్, హైదరాబాద్లలో ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. కరాటే శిక్షణ పేరుతో యువతను తీవ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని, ఆయుధ శిక్షణ ఇస్తున్నారని, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వందల మందిని విచారించగా, భయానక కుట్రలు బయటపడ్డాయి.
దర్భంగా రైలు పేలుడులో
దర్భంగా రైలు పేలుడు ఘటనలోనూ మూలాలు హైదరాబాద్ నుంచే బయటపడ్డాయి. బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జరిగిన పేలుడు కేసులో ఎన్ఐఏ హైదరాబాద్కు చెందిన ఇద్దరు సోదరులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లను అరెస్ట్ చేసింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలులో వీరే రసాయనాలతో కూడిన పార్శిల్ను ఉంచినట్లు తేలింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాలతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్
ఐసిస్తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అబ్దుల్, ఢిల్లీలో పట్టుబడటానికి ముందు చాలా నెలల పాటు హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఇది ఉగ్రవాదులకు పాతబస్తీ ఎలా సురక్షిత ప్రాంతంగా మారుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఉజైఫా యామన్ లాంటి చదువుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మతపరమైన ప్రసంగాలతో వారిని ఆన్లైన్లోనే రాడికలైజ్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సాధారణ యాప్లను వదిలి ఎన్క్రిప్టెడ్, ట్రేస్ చేయడానికి వీలులేని ప్రత్యేక యాప్లను వాడుతున్నారు. నేరుగా దాడులు చేయకుండా స్థానికంగా సానుభూతిపరులను తయారుచేసి, వారి ద్వారా విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తున్నారు.
హవాలా మార్గాల్లో, క్రిప్టోకరెన్సీ ద్వారా విదేశాల నుంచి వీరికి నిధులు సమకూరుస్తున్నారు.
కొత్త రూపాల్లో ఉగ్రవాదం
జాతీయ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసులు ఎప్పటికప్పుడు ఉగ్రకుట్రలను భగ్నం చేస్తూ, ఎందరో ఉగ్రవాదులను, సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ కొత్త రూపాల్లో ఉగ్రవాదం పుట్టుకొస్తూనే ఉంది. బోధన్ ఘటన తెలంగాణలో ఉగ్రవాద మూలాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో మరోసారి హెచ్చరిస్తోంది. ఈ సైలెంట్ పాయిజన్ను అరికట్టాలంటే పోలీసుల నిఘాతో పాటు, తల్లిదండ్రులు, సమాజంలోని పెద్దలు కూడా యువత కదలికలపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, ఈ ఉగ్ర భూతం పెను ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
