
తమిళనాడులో ఎన్డీయే కూటమి ఉంటుందా?
చెన్నైలో రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే ను రానున్న 2026 శాసనసభ ఎన్నికల్లో ఓడించడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కూటములుగా బయల్దేరాయి. ఇటు విజయ్ స్థాపించిన టీవీకే, అటు ఎన్డీయే కూటమి ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచార సభలకు రిహర్సల్స్ నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని ప్రాంతాల్లో ప్రజల్లోకి దూసుకువెళుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ముందస్తు వ్యూహలు రచిస్తున్నారు. అయితే డీఎంకేకు పోటీగా బీజేపీ ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో ప్రధానంగా ఏఐడీఎంకే, పీఎంకే, ఐజేకే, ఏఎంఎంకే, తదితర పార్టీలు ఉండేవి.
బీటలు వారుతున్న ఎన్డీయే కూటమి
2019 ఎన్నికల్లో కూటమిలో చిన్న పార్టీలతో కలిపి దాదాపు 7 పార్టీలు పోటీ చేశాయి. అయితే ఈ సారి ఆ పరిస్థితులు కనబడటం లేదు. ఇప్పటికే ఎన్డీయే లో ఉన్న ఏఎంఎంకే పార్టీ వ్యవస్థాకుడైన టివి దినకరన్ కూటమిని వీడారు. భవిష్యత్ లో ఎవరితో కలిసేది, లేనిది ఇప్పడే చెప్పలేమని, డిసెంబర్ నాటికి తమ పొత్తు గురించి చెబుతామని తేల్చారు. సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ను ప్రకటించడంతో ఏఎంఎంకే బయటికి వచ్చింది. అలాగే పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గం కూడా బయటపడింది. సీఎం అభ్యర్థి మార్పులో ఎవైనా నిర్ణయాలు తీసుకుంటే కూటమిలోకి వచ్చే ఆలోచన చేస్తామని దినకరన్ ప్రకటించారు. మిగతా అన్బుమణి రాందాస్ నేతృత్వంలో ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. ఎన్డీయే కూటమిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ , పార్టీ క్రీయాశీలక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అసలు అది కూటమిలో ఉంటుందా? ఉండదా అనే సంధిగ్ధంలో ఉంది. అలాగే ఐజేకే(ఇండియా జననాయకర్ కచ్చి) కూడా అలాగే వ్యవహరిస్తుంది. అంటిముట్టనట్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ఈ పార్టీ కూడా ఈ సారి ఎన్నికల్లో కలిసొస్తుందా లేనిదే వేచిచూడాల్సిందే. డీఎండీకే, కేఎండీకే, కృష్ణస్వామి సారధ్యం వహిస్తున్న పీటీ(పుతియా తమిళ్ కజగం) కూడా ఈసారి యాక్టివ్ గా లేవు. చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో రెండే పార్టీలు ఉండేలా ఉన్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే కూడా కూటమి నుంచి బయటకొచ్చే ఆలోచనలో ఉంది. ఒకవేళ వస్తే కూటమిలో అధిక ప్రాధాన్యమున్న పార్టీ, తమిళనాడులో ప్రజా బహుళ్యం ఉన్న పార్టీ దూరమైతే బీజేపీకి గడ్డుకాలమే.
అన్నాడీఎంకే బయటికి వస్తుందా?
కూటమి నుంచి అన్నాడీఎంకే బయటికి వచ్చే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈపీఎస్ వర్గం ఎన్డీయే కూటమి నుంచి బయటికి రావాలని అన్నాడీఎంకే నాయకులు ఇటీవల ఈపీఎస్ కు తేల్చి చెప్పారు. వీలైతే ఒంటరిగానే డీఎంకే ను ఎదుర్కొందామని, కూటమిగా వద్దని తేల్చి చెప్పారు. అలాగే ఇటీవల పార్టీ నుంచి సెంగొట్టియన్ ను సస్పెండ్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. టీవీ దినకరన్ కూటమిని వీడిన తరువాత సెంగొట్టియన్ పార్టీ నుంచి వెళ్లిన నేతలను మళ్లీ రప్పిద్దామని అన్నారు. ఓపీఎస్, దినకరన్, శశికళ పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే సెంగొట్టియన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని అన్నాడీఎంకే భావించింది. బీజేపీ కి అనుకూలంగా ఉంటు అన్నాడీఎంకే ను చీల్చే కుట్ర చేస్తున్నారని, పార్టీ నుంచి బహిష్కరించింది. ఇలా సొంత పార్టీలోనే బీజేపీ కయ్యాలు పెట్టి తమిళనాడులో బలపడదామనే ప్రయత్నాలు చేస్తుండడం అన్నాడీఎంకే వర్గాలకు సహించట్లేదు. ఇలాగే ఉంటే రాష్ట్రంలో పార్టీ మరింత బలహీన పడే అవకాశం ఉన్నందున కూటమి నుంచి నిష్క్రమించాలని ఈపీఎస్ కు పార్టీ వర్గాలు సూచించాయి. అయితే ఎన్డీయేలో ఉండడం వల్ల ప్రధానంగా ముస్లింలను, కమ్యూనిస్టులను, బహుజనులను క్రమంగా దూరం చేసుకోవాల్సి వస్తుందని, అలాగే బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్న పార్టీతో జతకట్టడం వల్ల భవిష్యత్ లో మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ నాయకులు ఈపీఎస్ ను హెచ్చరించారు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంది. అయితే ఆ ఎన్నికల్లో మరి పేలవమైన ప్రదర్శన చేసింది. దీంతో మళ్లీ ఎన్డీయే వైపు స్నేహ హస్తం చాచింది. ఇప్పడు ఒంటరిగానే ముందుకు వెళ్లాలనే ధోరణి ప్రదర్శిస్తోంది
టీవీకేకు కలిసొస్తుందా
తమిళనాడులోని ఎన్డీయే కూటమిలోని అంతర్గత లుకలుకలు తళపతి విజయ్ కి కలిసొచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఏఎంఎంకే, ఓపీఎస్ లాంటి నాయకులు విజయ్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు సాధరణ నేతలేమీ కాదు. ఆయా సామాజిక వర్గాల్లో పట్టున్నవారు. ఓపీఎస్ అయితే ముఖ్యమంత్రిగానే పని చేశారు. అందులో ఇద్దరూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారే. వారికి రాష్ర్టంలోని నియోజకవర్గాల్లో పట్టు ఉంది. కార్యకర్తలను, నాయకులను ఓకే తాటిపైకి తేవడం వారికి తేలికే. దాంతో పాటు దినకరన్ కు శశికళ ఆశీస్సులు ఉండనే ఉన్నాయి. ఎన్డీయే కూటమిలో దెబ్బతింటున్న అవకాశాలను విజయ్ రాజకీయంగా మల్చుకుంటే డీఎంకే కు ధీటుగా నిలబడే అవకాశం ఉంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు చాలా హాట్ గా మారాయి. ఏం జరగుతుందో ఎవరూ ఏ కూటమిలో చేరుతారో వేచి చూడాల్సిందే.
