Let's talk: editor@tmv.in
ప్రోటోకాల్ పాటించని రాహుల్ గాంధీ

ప్రోటోకాల్ పాటించని రాహుల్ గాంధీ

T Venkata Ramana
12 సెప్టెంబర్, 2025

రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని సీరియస్ గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. డిసెంబర్ 30 నుండి జనవరి 9 వరకు ఇటలీ, మార్చి 12 నుండి 17 వరకు వియత్నాం, ఏప్రిల్ 17 నుండి 23 వరకు దుబాయ్, జూన్ 11 నుండి 18 వరకు ఖతార్, జూన్ 25 నుండి జూలై 6 వరకు లండన్, సెప్టెంబర్ 4 నుండి 8 వరకు మలేషియా వంటి దేశాలకు గాంధీ చేసిన విదేశీ పర్యటనలను సీఆర్ఫీఎఫ్ అధికారి ప్రస్తావించారు. సీఆర్ఫీఎఫ్ ఎల్లో బుక్లో పేర్కొన్న ప్రోటోకాల్లను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ఈ విషయంపై రాహుల్ కానీ, ఖర్గే కానీ స్పందించలేదు.

55 మంది సిబ్బంది

కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష్ నేత రాహుల్ గాంధీకి ప్రస్తుతం అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ ఎల్) తో జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. జడ్ ప్లస్, ఏఎస్ ఎల్ అనేది గణనీయమైన ముప్పును ఎదుర్కొంటున్న వ్యక్తులకు కల్పించే అత్యున్నత భద్రత. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలతో సహా దాదాపు 55 మంది భద్రతా సిబ్బందిని కలిగి ఉంటుంది. ఏఎస్ఎల్ కింద భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులు, నిఘా అధికారుల సమన్వయంతో వీఐపీలు సందర్శించే ప్రదేశాల్లో ముందస్తు నిఘా నిర్వహిస్తారు.

ఇది మొదటిసారికాదు

సీఆర్పీఎఫ్ ఇలా లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో రాహుల్ గాంధీ 2020 నుంచి 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. వీటిలో భారత్ జోడో యాత్ర కూడా ఉంది. 2023లో కాశ్మీర్లో యాత్ర సాగిన సమయంలో భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరినప్పుడు భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.

ప్రోటోకాల్ పాటించని రాహుల్ గాంధీ - Tholi Paluku