Let's talk: editor@tmv.in
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేదే పాకిస్థాన్

ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేదే పాకిస్థాన్

Venkatesh Balusula
14 సెప్టెంబర్, 2025

పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి ద్వంద ప్రమాణాలు అనుసరిస్తోందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసిది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశమని, అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు తమ నేలపై ఆశ్రయం కల్పించిన వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డానీ దొనాన్ విమర్శలు చేశారు.

ఆశ్రయమిస్తే చర్యలు తీసుకోవాల్సిందే

దోహాలో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి ఆసిం ఇఫ్తికార్ ఇచ్చిన వ్యాఖ్యలకు కౌంటర్గా దొనాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్ను పాకిస్థాన్లో చంపినప్పుడు విదేశీ నేలపై ఉగ్రవాదిని ఎందుకు టార్గెట్ చేశారని ఎవరూ అడగలేదన్నారు. ఒక ఉగ్రవాదికి ఆశ్రయం ఎందుకు ఇచ్చారని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించిందని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి పాల్పడే వారికి ఎవ్వరు ఆశ్రయం ఇచ్చినా నేరమే అని చెప్పారు. హమాస్ నేతలపై చర్యలు తీసుకోవడంలో ఏ దేశానికైనా పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. 9/11 ఘటనను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన దాడికి అది సారూప్యంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితి అప్పట్లో ఇచ్చిన తీర్మానం ప్రకారం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

సమాన ప్రమాణాలు పాటించాలి

పాకిస్థాన్ ప్రతినిధి ఇఫ్తికార్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ చర్యలు పూర్తిగా అక్రమమైనవన్నారు. అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపించారు. గాజా, సిరియా, లెబనాన్, ఇరాన్, యెమెన్లో ఇజ్రాయెల్ చేసే దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించాలన్నారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రతినిధి దొనాన్ “మీ దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఉండడాన్ని ఎవరూ మరిచిపోలేరు. అమెరికా అతడిని అక్కడ చంపింది? అప్పట్లో ఎవరూ అమెరికాను ఖండించలేదు. అదే ప్రామాణికత ఇతర దేశాలకూ వర్తించాలి. కానీ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం మిగతా దేశాలకంటే భిన్నంగా చూడటం సరికాదు” అన్నారు. 2011లో పాకిస్థాన్లోని అబోటాబాద్లో అమెరికా ప్రత్యేక దళాలు నిర్వహించిన ఆపరేషన్లో ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. లాడెన్ ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఆశ్రయం పొందాడు. ఇజ్రాయెల్ ప్రతినిధి వ్యాఖ్యల ప్రకారం ఉగ్రవాదంపై పోరాటంలో సమాన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేదే పాకిస్థాన్ - Tholi Paluku