
ఐటీఆర్ దాఖలుకు తుది గడువు?
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు సెప్టంబర్ 15. కానీ ఇప్పటికీ చాలా మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైలింగ్ ఫ్లాట్ఫామ్స్ లో లోపం కారణంగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు గడువు సమీపిస్తూ ఉండటం కూడా టాక్స్ పేయర్స్ లో ఆందోళనకు కారణమవుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుది గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.
కానీ ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు పెంచామని ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ చెబుతోంది. ఈ ఏడాది జులై 31కి తుది గడువు పెట్టినట్టు..ఆ తుది గడువును సెప్టంబర్ 15 వరకు పొడిగించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు పెంచాలని బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఈ మేరకు ఆమెకు లేఖ రాశారు. ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతంలోనే ఒకసారి తుది గడువును పెంచారు. కానీ ఇప్పుడు మళ్లీ పెంచుతారా ? లేదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. బీజేపీ ఎంపీల అభ్యర్థన మేరకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారా ? అన్న చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు కొన్ని సాంకేతిక కారణాల కారణంగా రీఫండ్ అవ్వడం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలు సరిపోలక పోవడం వంటి అనేక ఇతర కారణంగా రీఫండ్ ఆలస్యం అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మందికి తొందరగానే రీఫండ్ అవుతున్నట్టు చెబుతున్నారు. ఐటీఆర్ తుది గడువులోపు దాఖలు చేయడం మాత్రమే కాదు. వాటిని ఖచ్చితమైన సమాచారంతో దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది అయోమయంతో, తెలియనితనంతో తక్కువ ఆదాయాన్ని చూపడం, తప్పుడు సమాచారాన్ని దాఖలు చేయడం వంటి పనులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఇబ్బందికరంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారికి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందని, అధిక మొత్తంలో జరిమానా విధించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచాలని సూచిస్తున్నారు.
