Let's talk: editor@tmv.in
చేయని నేరానికి దశాబ్దాల నరకం

చేయని నేరానికి దశాబ్దాల నరకం

T Venkata Ramana
14 సెప్టెంబర్, 2025

ముంబయిని వణికించిన 2006 రైలు పేలుళ్ల కేసు విచారణలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏళ్లపాటు జైలు జీవితం గడిపి దశాబ్దం క్రితమే నిర్దోషిగా బయటపడిన పాఠశాల ఉపాధ్యాయుడు అబ్దుల్ వహీద్ షేక్ ఇప్పుడు తనపై తప్పుడు కేసు బనాయించి, జీవితాన్ని నాశనం చేసినందుకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి రూ.9 కోట్ల భారీ నష్టపరిహారం కోరుతున్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఉగ్రవాది అనే ముద్ర వేసి తన భవిష్యత్తును చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు మరో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో అబ్దుల్ వహీద్ పోరాటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే

జులై 11, 2006లో ముంబయి వాసులకు అదో చీకటి రోజు. రద్దీగా ఉండే సాయంత్రం వేళ పశ్చిమ రైల్వేలోని సబర్బన్ రైళ్లలో కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఏడు చోట్ల శక్తిమంతమైన బాంబులు పేలాయి. మాతంగి రోడ్, మాహిమ్ జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బోరివలి స్టేషన్ల వద్ద జరిగిన ఈ వరుస పేలుళ్లలో 189 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ మారణహోమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ , దీని వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ( సిమి) కార్యకర్తల హస్తం ఉందని ఆరోపించింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా సహకారంతో ఈ కుట్ర పన్నారని పేర్కొంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకుని మొత్తం 13 మందిని ప్రధాన నిందితులుగా చూపిస్తూ అరెస్టు చేసింది.

అబ్దుల్ను ఎందుకు అరెస్టు చేశారు?

అరెస్టయిన వారిలో ముంబ్రాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబ్దుల్ వహీద్ షేక్ కూడా ఉన్నారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి వహీద్ షేక్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడని, వారికి లాజిస్టికల్ సపోర్ట్ అందించాడని ఏటీఎస్ ప్రధానంగా ఆరోపించింది. అతని ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కొన్ని సమావేశాలు జరిగాయని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను వహీద్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు. తనను బలవంతంగా కేసులో ఇరికించారని నేరం ఒప్పుకోవాలని థర్డ్-డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించారు.

ఏళ్లపాటు ఈ కేసు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో నడిచింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2015 సెప్టెంబర్లో కోర్టు తీర్పు వెలువరించింది.

నిర్దోషిగా అబ్దుల్ వహీద్

అబ్దుల్ వహీద్ షేక్పై మోపిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తేల్చిన కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. విచారణ అనంతరం 12 మందికి శిక్ష విధించింది. మరో 12 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు గత జులైలో సంచలన తీర్పు ఇచ్చింది. ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చిన 12 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. వీరిపై నేరాన్ని రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు విశ్వసనీయంగా లేవని, బలవంతపు వాంగ్మూలాలపై ఆధారపడి కేసును నిర్మించారని, నేరానికి, నిందితులకు మధ్య బలమైన సంబంధాన్ని నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో కమల్ అన్సారీ, తన్వీర్ అన్సారీ, మహమ్మద్ ఫైసల్ షేక్, ఎహ్తేషామ్ సిద్ధిఖీ, నవీద్ ఖాన్, ఆసిఫ్ ఖాన్, జమీర్ షేక్, మహమ్మద్ సాజిద్ అన్సారీ, ముజమ్మిల్ షేక్, సోహైల్ షేక్, మహమ్మద్ అలీ, డాక్టర్ తన్వీర్ అన్సారీ ఉన్నారు.అబ్దుల్ తనకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తనకు పునరావాసం కూడా కల్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు.

నా జీవితం నాకు తిరిగిస్తారా?

ఉగ్రవాది అనే ముద్ర నా జీవితాన్ని ఛిద్రం చేసింది. నేను పనిచేసే పాఠశాల నుంచి నన్ను తొలగించారు. నా భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు వీధిన పడ్డారు. సామాజికంగా వెలివేతకు గురయ్యాం. కస్టడీలో చిత్రహింసల వల్ల శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ కోసం రూ.30 లక్షలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చినా ఉగ్రవాది అనే కళంకం నన్ను వెంటాడుతూనే ఉంది. ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నా సహ నిందితులు కూడా అమాయకులని ప్రపంచానికి తెలిసే వరకు నైతిక బాధ్యతగా వేచి చూశాను. ఇప్పుడు వారంతా నిర్దోషులుగా విడుదలయ్యారు. మా జీవితాలను నాశనం చేసినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అని వహీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వం ముందున్న సవాళ్లు

అబ్దుల్ వహీద్ పోరాటం ఇప్పుడు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల ముందు అనేక క్లిష్టమైన ప్రశ్నలను ఉంచుతోంది. బాంబే హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ఏటీఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తే ఈ కేసులో దర్యాప్తు పూర్తిగా గాడి తప్పిందని అంగకరించాల్సి వస్తుంది.వహీద్కు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరిస్తే, అది ఒక కొత్త సంప్రదాయానికి దారితీస్తుంది. ఇటీవల విడుదలైన 12 మంది కూడా ఇదే డిమాండ్తో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా, నైతికంగా ఇబ్బందికర పరిణామం. గతంలో అక్షరధామ్ పేలుళ్ల కేసులో నిర్దోషులుగా విడుదలైన వారికి సుప్రీంకోర్టు ఆదేశాలతో పరిహారం చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి.

అసలు దోషులెవరు?

13 మంది నిర్దోషులైతే, 189 మంది ప్రాణాలను బలిగొన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరకనట్లే. ఇది దర్యాప్తు సంస్థల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.అబ్దుల్ వహీద్ షేక్ పోరాటం కేవలం నష్టపరిహారం కోసం కాదు. అది న్యాయం కోసం, కోల్పోయిన గౌరవం కోసం, తనలాంటి అన్యాయపు బాధితుల గొంతుకగా చేస్తున్న పోరాటం. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా చేయని నేరానికి జీవితంలోని విలువైన సంవత్సరాలను కోల్పోయిన వారికి వ్యవస్థ ఎలా న్యాయం చేస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

చేయని నేరానికి దశాబ్దాల నరకం - Tholi Paluku