Let's talk: editor@tmv.in
టెలికాం కంపెనీలకు షాకిచ్చిన ట్రాయ్!

టెలికాం కంపెనీలకు షాకిచ్చిన ట్రాయ్!

Shaik Mohammad Shaffee
14 సెప్టెంబర్, 2025

దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లు తమ 1జీబీ ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఉపసంహరించుకోవడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ చర్య గ్రామీణ, తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇంటర్నెట్ సదుపాయం కష్టతరం చేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ట్రాయ్ రెండు సంస్థలనూ కోరినట్లు జాతీయ మీడియా వెబ్సైట్లలో కథనాలు వెలువడ్డాయి.

అసలేం ఏం జరిగింది?

ఈ కథనాల ప్రకారం.. గత నెలలో జియో, ఎయిర్టెల్ రెండూ తమ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్లను ఉపసంహరించుకున్నాయి. ఈ ప్లాన్లలో రోజుకు 1జీబీ డేటా లభించేది. జియో ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఉండగా, ఎయిర్టెల్ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో ఉండేది. ఈ ప్లాన్ల ఉపసంహరణ వెనుక కారణాలను వివరిస్తూ ట్రాయ్కు వివరణాత్మక నివేదిక సమర్పించాలని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ట్రాయ్ను ఆదేశించింది.

కంపెనీల వివరణ

ఉపసంహరించిన ప్లాన్లు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో మాత్రమే తొలగించబడ్డాయని, జియో స్టోర్లలో ఇప్పటికీ ఆఫ్లైన్లో లభ్యమవుతున్నాయని జియో తెలిపింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్లాన్లను పునఃసమీక్షించినట్లు పేర్కొంది. అలాగే ఎయిర్టెల్ తమ ఈ నిర్ణయం అంతర్గత అంచనాలు, వినియోగదారుల డేటా విశ్లేషణ ఆధారంగా తీసుకున్నట్లు వివరించింది. అయితే రూ.249 ప్లాన్ స్థానంలో ఎక్కువ వ్యాలిడిటీతో కూడిన రూ.299 ప్లాన్ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. 5జీ నెట్వర్క్ విస్తరణకు భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ)ను పెంచుకోవడంపై దృష్టి సారించాయని అంచనా. ఈ చర్య వల్ల జియో ఏఆర్పీయూ 6 నుంచి 7 శాతం వరకు, ఎయిర్టెల్ ఏఆర్పీయూ 4 నుంచి 4.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

టెలికాం కంపెనీలకు షాకిచ్చిన ట్రాయ్! - Tholi Paluku