
నేడే యూపీఎస్సీ పరీక్షలు
తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేడు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ పరీక్ష (II), 2025ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా భారత సైనిక దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో మొత్తం 406 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, హనుమకొండ, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నిర్వహిస్తున్నారు.
ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష రెండు షిప్టుల్లో జరగనుంది. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1 మ్యాథమేటిక్స్ పరీక్ష జరుగుతుంది. దీనికి మొత్తం 300 మార్కులు కేటాయించారు. అలాగే పేపర్-2 జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పేపర్కు 600 మార్కులు ఉంటాయి. మొత్తం రాత పరీక్షకు 900 మార్కులు కేటాయించారు. ఈ రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్-టైప్ ప్రశ్నలు ఉంటాయి.
పెన్-పేపర్ (ఆఫ్లైన్) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూపీఎస్సీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షతో పాటు నేడు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షను కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ పరీక్ష మూడు షిప్టుల్లో జరగనుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ఉంటుంది. చివరగా మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) వెంట తీసుకువెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు వంటి వాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే బెటర్.
