
బ్రిటన్లో సిక్కు యువతిపై దాడి
ప్రపంచ దేశాల్లో భారతీయులపై జాత్యాహంకార దాడులు తీవ్రం అవుతున్నాయి. అమెరికా, కెనడా, యూకే ఇలా ప్రతి దేశంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బ్రిటన్లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ సిక్కు యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నువ్వు ఈ దేశానికి చెందిన దానికి కాదంటూ, తమ దేశం వదిలి తిరిగి సొంత దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు దీన్ని జాత్యాహంకార దాడిగా నిర్ధారించారు. వెస్ట్ మిడ్లాండ్స్లో స్మెద్విక్కు చెందిన 20 ఏళ్ల యువతిపై మంగళవారం ఉదయం ఓల్డ్బరీలోని టేమ్ రోడ్డులో లైంగిక దాడి జరిగింది. ఆమెపై దాడికి పాల్పడిన ఇద్దరు స్థానిక యువకులు నువ్వు ఈ దేశానికి చెందిన దానివి కాదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు తలకు గుడ్డ చుట్టుకొని ఉండగా, మరొకరు నీలం రంగు దుస్తులు ధరించినట్లు తెలిపారు. పోలీసులు సీసీటీవీ, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నారు.
ఘటనపై స్పందించిన వెస్ట్ మిడ్లాండ్స్ అధికారి కిమ్ మాడిల్ మాట్లాడుతూ ఇది చాలా అరుదైన సంఘటన అని, బాధితురాలిని బెదిరింపులకు గురిచేసిన ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక గురుద్వారాలో జరిగిన సమావేశంలో మత సంస్థల నాయకులు, సిక్కు సమాజ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సిక్ ఫెడరేషన్ యూకే ప్రధాన సలహాదారుడు జస్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో విదేశీయులపై, వలసదారులపై ద్వేషం పెరుగుతోందన్నారు. ఇలాంటి దాడులను సహించకూడదన్నారు.
గతంలోనూ పలు ఘటనలు
గతంలో బ్రిటన్లో నివసిస్తున్న దక్షిణాసియన్లు, ముఖ్యంగా పంజాబీలపై ఎన్నో జాతి వివక్ష ఘటనలు జరిగాయి. 2022లో లీసెస్టర్ నగరంలో హిందూ, ముస్లిం మత కలహాల నేపథ్యంలో సిక్కు, ఇతర ఆసియా వర్గాలపై కూడా దాడులు చేశారు. ఇలాంటి ఘటనలు బ్రిటన్లో వలసదారులపై ఉన్న అణచివేత ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. స్మెద్విక్ నియోజకవర్గ ఎంపీ గజేందర్ సింగ్ జోసాన్ ఈ ఘటనపై స్పందించారు. ఇది ఒక భయంకరమైన దాడి అని, బాధితురాలి జీవితంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రజలు ముందుకొచ్చి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
బ్రిటన్లో పెరుగుతున్న జాత్యాంహకార వైరం
ఇటీవలి కాలంలో బ్రిటన్లో వలసదారులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్ అధికారికంగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విదేశీయులపై అనుమానాలు, విమర్శలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. మీడియా, రాజకీయం, సంఘ సంస్కరణల నేపథ్యంలో వలసదారుల మీద ద్వేషం పెరిగిందని పౌర సంఘాలు చెబుతున్నాయి. ఇలాంటి సంఘటనలు బ్రిటన్లో సాంఘిక సామరస్యతకు సవాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది.
