Let's talk: editor@tmv.in
కాంగోలో ఘోర బోటు ప్రమాదాలు

కాంగోలో ఘోర బోటు ప్రమాదాలు

Venkatesh Balusula
14 సెప్టెంబర్, 2025

కాంగోలో రెండు రోజుల వ్యవధిలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికంగా రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర బోటు ప్రమాదాల్లో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. కాంగోలోని ఈక్వటూర్ ప్రావిన్స్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బుధ, గురు వారాల్లో 150 కిలోమీటర్ల దూరంలో రెండు విభిన్న ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

మంటలు చెలరేగి తలకిందులైన నౌక

లూకోలెలా టెరిటరీలోని మలాంజే గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఓ నౌక ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యలో సాంకేతిక సమస్యతో నౌకలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే నౌక పూర్తిగా తలకిందులైంది. ఈ సమయంలో నౌకలో దాదాపు 500 మందికి పైగా ప్రయాణికులున్నారు. నౌక మునిగిపోవడంతో 107 మంది మరణించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని 209 మందిని ప్రాణాలతో రక్షించారు. మరో 146 మంది ఆచూకీ తెలియడం లేదని హ్యూమనిటేరియన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బసాంకుసు ప్రాంతంలో మరో ప్రమాదం

బుధవారం జరిగిన మరో ఘటనలో బసాంకుసు టెరిటరీలో ఓ మోటరైజ్డ్ బోటు మునిగి సుమారు 86 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదాలకు గల కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అయితే బుధవారం జరిగిన ఘటనలో ఎక్కువ మందిని నౌకలో ఎక్కించడం, రాత్రి సమయంలో ప్రయాణించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది ప్రమాదం జరిగిన స్థలానికి చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారే కావడంతో వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ వరుస ప్రమాదాల అనంతరం నేవీ సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద సంస్థలు కలిసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం గాయపడిన వారికి వైద్య సేవలు, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, అలాగే ప్రాణాలతో బయటపడిన వారిని వారి స్వస్థలాలకు తీసుకెళ్లే చర్యలు చేపట్టింది.

ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం

కాంగోలో ప్రజలు ఎక్కువగా నదీ రవాణాపైనే ఆధారపడతారు. ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసిన బోట్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఖర్చు కూడా తక్కువ కావడంతో ఒక్కోసారి పరిమితికి మించి ప్రయాణికులు ఒకే బోటులో వెళ్తుంటారు. ఈ బోట్లు కనీస ప్రమాణాలు కూడా పాటించవు. వీటిలో లైఫ్ జాకెట్లు కూడా ఉండవు. ప్రభుత్వం కూడా వీటి నిర్వహణపై తనిఖీలు చేపట్టడం లేదు. బోట్లలో ఎలాంటి శిక్షణ లేని సిబ్బంది ఉంటున్నారు. చాలా మంది రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగితే సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. దీంతో అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. ఏటా ఇలా ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

కాంగోలో ఘోర బోటు ప్రమాదాలు - Tholi Paluku