
రష్యాలో భారీ భూకంపం
ఇటీవలె రష్యాలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో భూకంపం వణికించింది. శనివారం ఉదయం కమ్చట్కా నగరానికి 111 కిలో మీటర్ల దూరంలో తూర్పున 39.5 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. మొదట 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపాన్ని తర్వాత 7.4కి సవరించారు. దీంతో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం రష్యా తీరాల వద్ద సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంపంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
రష్యాలో తరచూ భూకంపాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 29న 8.8 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని భూకంపం కుదిపేసింది. ఆ భూకంపం పసిఫిక్ మహా సముద్రంలో నాలుగు మీటర్ల ఎత్తులో సునామీ తరంగాలను రేపింది. హవాయి నుంచి జపాన్ వరకు ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలించారు. జపాన్ అధికారులు రెండు మిలియన్ల మందిని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. ప్రాంతీయంగా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తర్వాత ఆ హెచ్చరికలు రద్దయ్యాయి. కమ్చట్కా చరిత్రలో భూకంపాలు సర్వ సాధారణం. గతంలో ఇక్క 9.0, 8.2, 8.4 తీవ్రతలతో భూకంపాలు నమోదయ్యాయి. 2011లో జపాన్ తీరంలో సంభవించిన 9.1 తీవ్రత గల భూకంప ప్రమాదంలో 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కమ్చాట్కాలో భూకంప ప్రభావంపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం వెల్లడించలేదు. ఇప్పటి వరకు నష్టం, ప్రాణహానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా భూకంపం చరిత్రలోని పెద్ద భూకంపాల కంటే చిన్నది. అయినా ప్రమాదం తీవ్రంగానే ఉండవచ్చు. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
