
వివాదానికి దారితీసిన పెంపుడు కుక్క పేరు
ఇందోర్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది. సాధారణంగా పెంపుడు జంతువులకు యజమానులు సరదాగా లేదా ఇష్టమైన పేర్లు పెడుతుంటారు. కానీ ఈసారి పెట్టిన పేరు పొరుగింటి వ్యక్తి ఇంటిపేరే కావడంతో సమస్యలు తలెత్తాయి. చిన్న కారణంగా ప్రారంభమైన వాగ్వాదం చివరకు కేసు నమోదు దాకా వెళ్లింది.
రాజేంద్రనగర్లోని శివ్ సిటీ కాలనీలో ఓ వ్యక్తి తన కుక్కను పొరుగువారి ఇంటి పేరుతో పిలిచాడు. ఈ దృశ్యం చూసిన చుట్టుపక్కలవారు నవ్వుకోవడంతో బాధితుడు అవమానానికి గురయ్యాడు. బాధితుడి భార్య దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలా ఎందుకు పిలిచావు అని అడిగినందుకు కుక్క యజమాని ఆమెతో దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్త తీవ్రరూపందాల్చింది. పరిస్థితి మరింత ఉద్రిక్తమై, బాధితుడిని కుక్క యజమాని తోసేయడంతో ఆయన గోడకు తగిలి గాయపడ్డాడు.
ఈ సంఘటనపై బాధిత దంపతులు ఫిర్యాదు చేయగా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిధి సక్సేనా ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. నిందితుడు కావాలనే పొరుగువారిని కించపరచే ఉద్దేశ్యంతో ఈ చర్యకి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది. ప్రస్తుతం అతనిపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ విచిత్ర సంఘటనతో శివ్ సిటీ ప్రాంతంలో చర్చలు జోరందుకున్నాయి. పొరుగువారితో చిన్న చిన్న కారణాలకే గొడవలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో గౌరవం, ఓర్పు తగ్గిపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
