
‘కారు’ దిగిన చోటే పోరాటం
అధికారం కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదంటూ బీఆర్ఎస్ అధినాయకత్వం దూకుడు పెంచింది. ముఖ్యంగా పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 'జంపర్ ఎమ్మెల్యేల'పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారి నియోజకవర్గాల్లోనే పర్యటనలు, బహిరంగ సభల ద్వారా ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడంతో పాటు పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం గద్వాల నియోజకవర్గంలో ఆయన పర్యటన, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఇదే తరహా కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గద్వాల నుంచే శంఖారావం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన బండారు కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుదారుగా మారడంతో గద్వాల రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడి నుంచే తమ రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. శనివారం గద్వాలకు విచ్చేసిన కేటీఆర్కు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ తన క్షేత్రస్థాయి బలాన్ని మరోసారి ప్రదర్శించింది. ఇది కేవలం కృష్ణమోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఒక హెచ్చరికగా బీఆర్ఎస్ భావిస్తోంది.
వ్యూహం వెనుక అసలు కథ!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికి ప్రతిగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో సహా 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం కాలేదని స్పీకర్కు వివరణ ఇచ్చారు. ఈ ద్వంద్వ వైఖరినే బీఆర్ఎస్ ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. "మీరు బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పీకర్కు చెబుతున్నారు కదా మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ నియోజకవర్గానికి వస్తే ఎందుకు స్వాగతం పలకలేదు? పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? అని ప్రజల మధ్యే వారిని నిలదీసే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సాంకేతికంగా వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ నైతికంగా కాంగ్రెస్ నాయకులుగా మారిపోయారని ప్రజల చేతనే తీర్పు చెప్పించాలన్నది కేటీఆర్ పర్యటనల వెనుక ఉన్న ప్రధాన వ్యూహం.
క్యాడర్ను కాపాడుకునే కసరత్తు
ఒక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు, అతనితో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా కొత్త పార్టీలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించేందుకే బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన వెంటనే నియోజకవర్గ ఇన్చార్జిగా హనుమంతునాయుడును నియమించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వంటి సీనియర్లకు పార్టీ యంత్రాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కేటీఆర్ పర్యటనతో ఆ క్యాడర్కు పూర్తి భరోసా కల్పించినట్లయింది. "నాయకులు పోయినా, పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ గౌరవానికి, భవిష్యత్తుకు మాది హామీ" అనే బలమైన సంకేతాన్ని కేటీఆర్ తన పర్యటన ద్వారా ఇచ్చారు.
తిరిగి వచ్చినా... దారులు మూసినట్లేనా?
పార్టీ మారిన నేతలు ఒకవేళ తిరిగి బీఆర్ఎస్లోకి రావాలని ప్రయత్నించినా వారికి ఇక్కడ భవిష్యత్తు ఉండదనే సంకేతాలను కూడా ఈ పర్యటనలు పరోక్షంగా ఇస్తున్నాయి. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీ నమ్మిన వారిని నట్టేట ముంచితే సహించేది లేదని అధిష్టానం గట్టిగా చెబుతోంది. మొత్తం మీద గద్వాల సభతో బీఆర్ఎస్ తన రాజకీయ పోరాటాన్ని కొత్త దశకు తీసుకువెళ్లింది. రానున్న రోజుల్లో మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా ‘పొలిటికల్ హీట్’ ఖాయంగా కనిపిస్తోంది.
