Let's talk: editor@tmv.in
రైతులను మోసం చేస్తున్నారు: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

రైతులను మోసం చేస్తున్నారు: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Gaddamidi Naveen
14 సెప్టెంబర్, 2025

జిల్లాలోని మెర్తాడ్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మాత్రం ఎలాంటి శ్రద్ద చూపడం లేదని ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరి పొట్టకు ఉంది, వారం రోజుల్లో యూరియా రాకపోతే రైతుల దిగుబడి పడిపోతుంది. వెంటనే యూరియా ఇవ్వకుంటే ఉద్యమానికి సిద్ధం’ అని తేల్చి చెప్పారు. రైతుల ప్రభుత్వం అంటూ రైతులను మోసం చేస్తున్నరని రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. రైతులు రోడ్లపై ధర్నాలు చేయడం కనిపించడం లేదని, వాళ్ల కష్టాలు, బాధలు వినిపించడం లేదని రేవంత్ రెడ్డిని తప్పుబట్టారు.

కేసిఆర్, కేటీఆర్లను జైలుకు పంపించాలన్న ఆలోచనతోనే ప్రస్తుత ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో 20 వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. కానీ రోడ్లపై ఉన్న ఒక్క గుంత కూడా పుడ్చలేదు. నాలుగు లక్షల కోట్లతో ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ ఐనా కట్టావా?’ అని ప్రశ్నించారు. రైతులకి వెంటనే యూరియా సరఫరా చేయాలని, లేకుంటే రైతులతో పాటు మహిళలను భాగస్వాములుగా చేసుకుని ఉద్యమాలు చేపడతామన్నారు.

రైతులను మోసం చేస్తున్నారు: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి - Tholi Paluku