
జూబ్లీహిల్స్ ఉప సమరంలో బీజేపీ వ్యూహం
ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక వేడి రాజుకుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఎన్నిక ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. ఒకవైపు దివంగత ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దించి సానుభూతితో పాటు స్థానిక బలాన్ని నమ్ముకుని బీఆర్ఎస్ "సై" అంటుండగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన స్థానిక అభ్యర్థి కోసం అన్వేషిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేస్తూ మాటల యుద్ధానికి తెరలేపిన ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ నిశ్శబ్దంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. పైకి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నా తెరవెనుక పక్కా ప్రణాళికతో కమలదళం సమరానికి సిద్ధమవుతోంది.
సెమీ-ఫైనల్గా భావిస్తున్న బీజేపీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ క్రికెటర్ అజహరుద్దీన్ను పక్కనపెట్టి స్థానికంగా పట్టున్న నేతను బరిలోకి దించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఈ రెండు పార్టీల దూకుడు మధ్య బీజేపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తున్నా ఆ పార్టీ నాయకత్వం మాత్రం దీన్ని "వ్యూహాత్మక మౌనం"గా అభివర్ణిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను గమనిస్తూ సరైన సమయంలో దెబ్బకొట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికను కేవలం ఒక ఉపఎన్నికగా కాకుండా 2028 సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్గా భావిస్తున్న బీజేపీ గెలుపు కోసం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఐదుగురు సభ్యులతో కూడిన శక్తివంతమైన "ఉప ఎన్నిక మానిటరింగ్ కమిటీ"ని ఏర్పాటు చేశారు.
మధ్యతరగతి ఓటర్ల ఆధిపత్యం
ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ ఎం. రఘునందన్ రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీజేపీ బలాన్ని పెంచడం, స్థానిక ప్రజల సమస్యలను పార్టీ వైఖరితో అనుసంధానం చేయడం, బూత్ స్థాయి నాయకత్వం నుండి పై స్థాయి సమన్వయం వరకూ కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగించనుంది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విద్యావంతుల ప్రాంతం కావడంతో పాటు వ్యాపారవేత్తలు, ఐటీ ప్రొఫెషనల్స్, మధ్యతరగతి ఓటర్ల ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎప్పుడూ కఠినంగానే జరుగుతాయి. గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడూ ఈ నియోజకవర్గంలో తమ ప్రాతినిధ్యం కోసం పోరాడిన ఉదాహరణలు ఉన్నాయి.
బహుముఖ వ్యూహం
ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి హైదరాబాద్పై తమ పట్టు నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విద్యావంతులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు అధికం. బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని, కాంగ్రెస్ అధికార బలాన్ని తట్టుకుని నిలబడగల సమర్థుడైన, వివాదరహితుడైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. స్థానికంగా ప్రజలతో సంబంధాలు కలిగి యువతను ఆకట్టుకోగల నాయకుడిని బరిలోకి దించాలని భావిస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఎంపికపై కమిటీ దృష్టి పెట్టింది.
క్షేత్రస్థాయి ప్రచారంపై ఫోకస్
ప్రత్యర్థుల కంటే ముందే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయడం, ఓటర్ల జాబితాను విశ్లేషించడం,ఇంటింటి ప్రచారానికి పక్కా ప్రణాళికలు రచించడం వంటి బాధ్యతలను మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
ప్రధాన ప్రచార అస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. "డబుల్ ఇంజిన్ సర్కార్" ఆవశ్యకతను నొక్కి చెప్పడం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎదుర్కొన్న స్థానిక సమస్యలను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని హామీలను నెరవేర్చలేదని ప్రజలకు వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. నియోజకవర్గంలోని మైనారిటీ ఓటర్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అంశం కావడంతో వారిని మినహాయించి మిగిలిన అన్ని వర్గాల ఓట్లను ఏకీకృతం చేయడంపై బీజేపీ దృష్టి పెడుతోంది. హిందూ ఓట్ల డిలిమిడేషన్తో పాటు, తటస్థ ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడం ద్వారా గెలుపు సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక స్థానానికి పరిమితం కాదు. ఇది హైదరాబాద్లో తమ బలాన్ని ప్రదర్శించడానికి బీజేపీకి దొరికిన సువర్ణావకాశం. ఒకవైపు సానుభూతి పవనాలు, మరోవైపు అధికార పార్టీ బలం మధ్య బీజేపీ తన వ్యూహాత్మక చతురతతో క్షేత్రస్థాయి బలంతో ఎంతవరకు ప్రభావం చూపగలదో వేచి చూడాలి. మానిటరింగ్ కమిటీ పనితీరు, అభ్యర్థి ఎంపిక, ప్రచార పటిమ ఈ ఉపఎన్నిక ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. ఈ త్రిముఖ పోరులో కమలం వికసిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో నూతన సమీకరణాలకు నాంది పలుకుతుంది అనడంలో సందేహం లేదు.
