
సైబర్ క్రైమ్ వలలో మరో మ్యాట్రిమోనీ
ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్ పేరుతో హైదరాబాద్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ మాట్రిమోనీ వెబ్సైటు సృష్టించి లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠాను సైబర్ క్రైం పోలీసులు బట్టబయలు చేశారు.
“ఖుబ్సూరత్ రిస్తే” అనే పేరుతో ఒక వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రారంభించి అందులో ఆకర్షణీయమైన యువతుల ఫోటోలు అప్లోడ్ చేసి యువకులను ఉచ్చులో పడేశారు.ఈ పేజీల ద్వారా పరిచయం పెంచుకుని, నమ్మకాన్ని సంపాదించి, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు.ముఖ్యంగా ఒక ప్రొఫైల్లో పెట్టిన ఫోటో పాకిస్థాన్కు చెందిన ప్రసిద్ధ యూట్యూబర్ది అని తరువాత తెలిసింది.
అయితే వెబ్సైట్ పెట్టిన ఫొటో ఒక పాకిస్థానీ యూట్యూబర్ది అని తెలియక నగరానికి చెందిన ఓ వ్యక్తి మోసపోయాడు.సదరు యువకుడు ఆ ప్రొఫైల్లో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేయగా, తరచూ వీడియో కాల్స్ చేసి సన్నిహితంగా మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఖర్చుల పేరుతో మొత్తం రూ.25 లక్షలు వసూలు చేశారు.
తరువాత ప్రొఫైల్లో ఉన్న ఫొటో నిజానికి యూట్యూబర్దని తెలుసుకున్న బాధితుడు, డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు. నిందితులు నిరాకరించడంతో, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దర్యాప్తులో బిజాపూర్కు చెందిన అనీసా మహ్మదైసయీమ్ (33), నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అమేర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ట్యాబ్, బ్యాంక్ పాస్బుక్లు, చెక్బుక్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు జొహర్ ఫాతిమా (24) ఇంకా పరారీలో ఉంది.
పోలీసులు ఇలాంటి వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలపై నమ్మకం పెట్టుకోవద్దని, పెళ్లి లేదా ఆర్థిక లావాదేవీలకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.హైదరాబాద్లో బహిర్గతమైన ఈ కేసు, పెళ్లి పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాల తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, మోసగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం, పోలీసులకు వెంటనే సమాచారం అందించడం అత్యవసరం.
