
దసరాకు ప్రత్యేక రైళ్ళు
దసరా పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కాచిగూడ స్టేషన్ నుంచి పలు రైళ్లు నడుపుతుంది. హైదరాబాద్ నగరవాసులు ఏటా పండుగలను తమ కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరి వెళతారు. ఈ సందర్భంలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో కంటే ఎక్కువగా రైళ్లకు డిమాండ్ ఉంటుంది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు కొన్ని రైళ్లను ఇప్పటికే ముందస్తుగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా
కాచిగూడ నుంచి రైళ్లు ఆయా జిల్లాలు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్‌కు అనేక రైళ్లను నడుపుతున్నారు. వీటికి అదనంగా దసరా, దీపావళి, ఛత్ పండుగల కోసం మరిన్ని రైళ్లను ప్రత్యేకంగా ప్రకటించారు. డిమాండ్కు అనుగుణంగా రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పాత వాటికి అదనం
కాచిగూడ-బికనేర్ (07053), కాచిగూడ-మురుదేశ్వర్ (07191), కాచిగూడ-నాగర్సోల్ (07055) ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు నడుపనున్నట్లు ప్రకటించారు.
ప్రతి శనివారం కాచిగూడ-మధురై ఎక్స్ప్రెస్ రైలును నడుపుతున్నారు. అది ఈరోడ్, సేలం(తమిళనాడు) మీదుగా వెళుతుంది. పండుగకు ప్రకటించిన కాచిగూడ-మధురై (07191/07192) ఈనెల 20 నుంచి నవంబరు 26 వరకు అరుణాచలం మీదుగా సేవలు అందిస్తోంది. గోమతినగర్ నుంచి మహబూబ్నగర్ (05314/05313)కు ప్రత్యేక రైళ్లను ఈ నెల 28 నుంచి నవంబర్ 3 వరకు నడపనున్నట్లు రైల్వే తెలిపింది.
ఆర్టీసీ సేవలు
రోజువారీ రైళ్లు 100 కు పైగా నడపనున్నారు. ప్రయాణికులు 47 వేలకు వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. పండుగ కోసం ప్రత్యేకంగా 4 రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరం నలుమూలలా నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ రాకపోకలకు ఆర్టీసీ 200కుపైగా సర్వీసులు నడుపుతోంది. సికింద్రాబాద్, బోరబండ, మెహిదీపట్నం, అఫ్జల్గంజ్, పటాన్చెరు వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు గమ్యం యాప్ సహాయంతో బస్సుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు చేరుకొని సేవలను అందుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. స్పెషల్ ట్రైన్స్ నడిపే సందర్భంలో అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
