
బీజేపీతో జగన్ పొత్తు బహిరంగ రహస్యం!
వైఎస్ జగన్ పై చెల్లి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటు వేసి వైఎస్ రాజశేకరరెడ్డి గుండెల్లో కత్తి దింపారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర రెడ్డి బతికి ఉంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవారు అంటూ మాట్లాడారు. జగన్ రాజకీయ వ్యభిచారి, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందే తన కొడుకు రాజారెడ్డి అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
వైఎస్ జగన్ బీజేపీతో రహస్యంగా పొత్తు పెట్టుకోలేదు. బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు. అయితే బీజేపీతో జగన్ కు ఉన్న బంధాన్ని టెక్నికల్ గా పొత్తు అనలేం కానీ పొత్తులాంటిదే అనొచ్చు. ఎందుకంటే జగన్ పై కాంగ్రెస్ కేసులు పెట్టినప్పటి నుంచి .. బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలు మొదలుపెట్టారు. మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆయనతో మంచి సంబంధాలు కొనసాగించారు. జగన్ సీఎం అయ్యాక ఆ బంధం మరింత బలపడింది. బీజేపీకి అవసరమైనప్పుడల్లా లోక్ సభలో, రాజ్యసభలో మద్దతు ఇస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తున్నామంటూ దానిని కప్పిపుచ్చుకున్నారు. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా గతంలోలాగే జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. జగన్ బీజేపీకి మిత్రుడన్న విషయం బహిరంగ రహస్యం. ఇందులో రహస్యం ఏమీ లేదు. షర్మిల ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేదు. అందరికీ తెలిసిన విషయమే ఆమె మళ్లీ చెప్పారు.
రాజశేఖరరెడ్డి బతికి ఉంటే.. కొడుకు చేసిన పనికి తలదించుకునేవారని షర్మిల మాట్లాడటం హాస్యాస్పదం. ఎందుకంటే ఆమె వైసీపీలో ఉన్నప్పుడు కూడా జగన్ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. బీజేపీతో సన్నిహితంగా ఉండటం తలదించుకునే పని అయినప్పుడు ఆ మాట షర్మిలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె వైసీపీలో ఉన్నప్పుడు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఆమె లేనప్పుడూ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉండటం తప్పు కానప్పుడు, ఇప్పుడెలా అవుతుందన్నది ప్రశ్న. షర్మిల విమర్శ అందరి రాజకీయ నాయకుల్లాగే ఉంది తప్పా, అందులో భిన్నత్వం ఏమీ లేదు.
జగన్ రాజకీయ వ్యభిచారి అనడం కూడా హర్షించదగ్గ మాటగా లేదు. ఎందుకంటే జగన్ కాంగ్రెస్ పార్టీలో లేరు. సొంతంగా పార్టీ నడుపుతున్నారు. ఆయన అవసరాల మేరకు విధానం మారుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు. బీజేపీ ఉంటే బీజేపీకి ఇస్తారు. బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు అన్న రూల్ కూడా లేదు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకపోతే ఆయన రాజకీయ వ్యభిచారు అవ్వరు. షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టారు కదా?. అప్పుడు ఆమె విధానం అవసరాలకు తగ్గట్టుగానే ఉంది కదా?. ప్రజాప్రయోజనాలను ప్రతిబింబించే విధంగా ఎప్పుడూ లేదు కదా ?. జగన్ తో ఆస్తుల పంపకంలో సమస్యే షర్మిల వేరు కుంపటికి కారణం. ప్రజాప్రయోజనాలు పరిరక్షణకు కాదు. ఆమెకు రాజశేఖరరెడ్డి పార్టీ మీద అంత ప్రేమ ఉంటే ఆరోజే కాంగ్రెస్ వీడాల్సింది కాదు. కాంగ్రెస్ లో కొనసాగి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు కదా ? అన్న ప్రశ్న షర్మిల వైపు సంధిస్తున్నారు.
షర్మిల కొడుకు గురించి జగన్ భయపడుతున్నారో తెలియదు కానీ జగన్ సోషల్ మీడియా మాత్రం కోయిల ముందే కూసింది అన్నట్టు వ్యవహరిస్తోంది. షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని చెప్పగానే .. రాజారెడ్డి ఇంటి పేరు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. షర్మిల కావాలనే తన కొడుకుని తీసుకొని కర్నూలు వెళ్లింది. షర్మిల కోరుకున్నట్టే వైసీపీ సోషల్ మీడియా ఆత్రంతో స్పందించిందన్న చర్చ జరుగుతోంది. ఇందతా ఆత్మనూన్యత భావనలో నుంచి పుట్టినదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ కు కొడుకులు లేరు. సాధారణంగా మన సమాజం వారసులు అంటే.. కొడుకనే భావిస్తారు. కాబట్టి షర్మిల ఆ పాయింట్ గుర్తించి తన కొడుకుని తెరమీదకి తెచ్చింది. అదే స్థాయిలో వైసీపీ నుంచి అలజడి కనిపించింది. కానీ షర్మిల భావించినట్టు, వైసీపీ ఊహించినట్టు ఇప్పుడే ఏదీ జరగదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
