
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
పార్వతీపురం మన్యం జిల్లా ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. తన పై నమ్మకంతో ఈ జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకొని పురోహితుల మంత్రోచ్చారణతో ఆశీర్వచనాలు తీసుకొని పార్వతీపురం మన్యం నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను శనివారం స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమాభివృద్ధికి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, మాలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టుసాధిస్తానని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు.
గతంలో కంటే మన్యం జిల్లాలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పధంలో నడిపిస్తానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే జిల్లా అభివృద్ధిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాలువతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది, ఏఎస్పీ అంకిత సురాన, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు డా.ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డిఆర్ఓ కె.హేమలత, డిప్యూటీ కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, డి.ఆర్.డి.ఏ, డ్వామా, ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి వై.నాగేశ్వరరావు, జిల్లా విద్యా శాఖాధికారి బి.రాజ్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
