Let's talk: editor@tmv.in
విశాఖ ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగాలి: సీపీఐ

విశాఖ ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగాలి: సీపీఐ

FL - YUGDR
14 సెప్టెంబర్, 2025

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. భారత పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు విమల, రాష్ట్ర సమితి సభ్యుడు పైడిరాజు, జిల్లా కార్యదర్శి రెహమాన్ తదితరులు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చెయ్యడం లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం మరో పక్కన ఉక్కులో 43 విభాగాలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చెయ్యడం వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని, విశాఖకు ఏమి చేశారని విశాఖలో సభ పెట్టి ఏం చెబుతారని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుపై విమర్శలు

నడ్డా విశాఖ పర్యటనలో ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, విభజన చట్టం లోని హామీలు అమలు చేస్తామని, విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో ప్రజలకు స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం అని రాష్టంలో ఉన్న కూటమి ప్రభుత్వం చెపుతూనే ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో ఆర్ ఎస్ ఎల్ ఆర్ మిట్టల్ కంపెనీ కి అన్ని అనుమతులు మంజూరు కోసం కృషి చేస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యడం కదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఈ నిరసన కార్యక్రమలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు, ఆర్ శ్రీనివాసరావు, కె వనజాక్షి, ఎం డి బేగం, ఎం మన్మధరావు, సి ఎన్ క్షేత్రపాల్, ఎన్ నాగభూషణం, వై రాంబాబు, ఎ దేముడమ్మ, బి పుష్పలత, కె లక్ష్మణరావు, జి జయ, ఎ ఆదినారాయణ, పి గోవింద్, జి రాంబాబు, ఎం శ్రీనివాసరావు తదితరులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగాలి: సీపీఐ - Tholi Paluku