
అదే కొనసాగితే ఏపీ కూడా నేపాలే!
నేపాల్లో రాజకీయ అస్థిరత, అవినీతిపై ప్రజల ఆగ్రహం భారతదేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను నేపాల్తో పోల్చడం విశ్లేషకులు మొదలుపెట్టారు. టెండర్ వ్యవస్థ లేకుండా కాంట్రాక్టర్ల ఎంపిక, గనులను మాఫియా ముఠాలకు అప్పగించడం, ఎమ్మెల్యేల స్థాయిలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగడం వంటివి రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రజలలో అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ పాలనను చిత్తుగా ఓడించిన ఆంధ్రులు, కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే తీరును అనుసరిస్తుండటంతో నిరాశకు గురవుతున్నారు.
సామంత రాజ్యాల్లా నియోజకవర్గాలు
అయితే, నేపాల్తో పోలిస్తే మన దేశానికి బలమైన రాజ్యాంగ వ్యవస్థ, 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్ర కలిగి ఉంది. నేపాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. రాజకీయ వ్యవస్థపై అక్కడి ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. భారతదేశంలో ఇంకా కొందరు అవినీతి మచ్చ అంటని నాయకుల వల్ల ప్రజలకు విశ్వాసం మిగిలి ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్లో అవినీతి, రాజకీయ జోక్యం, ప్రజాధనం దుర్వినియోగం వంటివి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను తమ రాజ్యాలుగా మార్చుకొని, ఇష్టానుసారంగా దోపిడీలకు తెరతీస్తున్నారు.
గత పాలకులనే అనుసరిస్తూ..
ప్రస్తుతం ఏపీలోనూ ప్రజాప్రతినిధులు, అధికారుల అవినీతి, దోపిడీలను చూస్తున్న ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తప్పుడు పోస్టుల సాకుతో కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుందంటున్నారు.
ఇలాంటి పోకడలు అనుసరించిన జగన్, కెసిఆర్లకు ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఒక హెచ్చరికగా తీసుకోవాలని సీనియర్ నేతలు చెబుతున్నారు. నేపాల్ తరహా తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా, ప్రజల ఆగ్రహం ఎప్పుడైనా వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. ప్రజల్లో అసంతృప్తి ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు.
