
నర్సరీ నుంచే లక్షల ఖర్చా?
స్కూల్ ఫీజు కట్టడానికే జీతమంతా అయిపోతుంది. నెలనెలా పిల్లల చదువులు, అసైన్మెంట్ల కోసమే ఇంటి ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తోంది. పిల్లల ఎదుగుదల కంటే ఏదీ ముఖ్యంకాదని భావించే సమాజం మనది. ఇందులో ఎలాంటి తప్పు లేకున్నా తల్లిదండ్రుల వీక్ పాయింట్ని చాలా విద్యసంస్థలు క్యాష్ పాయింట్లగా మార్చుకుంటున్నాయ్. దీనికి కొన్ని లెక్కలూ ఉన్నాయి. ఉదాహరణకు గుర్గావ్లో ఒక మధ్యతరగతి కుటుంబం బడ్జెట్ వేసుకునే సమయంలో కూరగాయలు, ఇంటి అద్దె, కరెంటు బిల్లులు లాంటివి సర్దుకుంటాయి కానీ.. చివరికి స్కూల్ ఫీజు దగ్గరే లెక్క తప్పిపోతుంది. 12 ఏళ్ల కూతురి చదువు ఖర్చు లెక్క చూస్తే మరోసారి ఇంటి అద్దె కట్టినట్టే ఉంటుంది. ఇది కేవలం గుర్గావ్కి మాత్రమే సంబంధించిన అంశం కాదు.. పట్టణాల్లో ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న అసలైన వేదన ఇదే.
ఇటు పట్టణాల్లో సగటు నెలవారీ ఖర్చు దాదాపు 7 వేల రూపాయలుగా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ చెబుతోంది. కానీ అందులో సగం కంటే ఎక్కువ విద్యకే వెళ్ళిపోతోంది. గుర్గావ్లో ఒక్కో పిల్లాడికి సంవత్సరానికి సుమారు 37 వేల రూపాయలు వెచ్చిస్తారు, ఢిల్లీలో 20 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పుస్తకాలు, యూనిఫాం, బస్ ఛార్జీలు, కోచింగ్ ఇలా అన్నీ కలిపితే తల్లిదండ్రుల జీతం సగానికి పైగా ఎగిరిపోతోంది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటు ఖర్చు కేవలం 2,863 రూపాయలే. ఈ రెండు లెక్కలను పోల్చి చూస్తే పబ్లిక్-ప్రైవేట్ మధ్య ఉన్న అంతరం ఎంత ఘోరమో బయటపడుతుంది.
కొన్ని నగరాల్లో ఈ భారం ఇంకా ఎక్కువ. చండీగఢ్లో సంవత్సరానికి ఒక్కో పిల్లాడిపై దాదాపు 50 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశ సగటుతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. అంటే విద్యా ఖర్చు కూడా ఒక ప్రాంతంతో మరో ప్రాంతానికి సంబంధం లేకుండా అసమానంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి హైదరాబాద్లో కూడా కనిపిస్తోంది. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ నుంచే ఫీజులు లక్షల్లో వసూలవుతున్నాయి. ఏబీసీడీ నేర్చుకునే తరగతులకే ఏడాదికి రెండు లక్షలకుపైగా ఫీజులు అడుగుతున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఇది మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది. మధ్యతరగతి తల్లిదండ్రులు ఇంటి అద్దె కట్టినట్టే స్కూల్ ఫీజులు కడుతున్నారు. కొన్ని స్కూళ్లలో ప్రతి ఏడాది 30 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తే గుర్గావ్, ఢిల్లీ, చండీగఢ్ మాత్రమే కాదు.. హైదరాబాద్లో కూడా విద్య అనేది ఆర్థికంగా పెద్ద భారం అవుతుందని స్పష్టమవుతోంది.
ఈ పెరుగుదల కేవలం కుటుంబాలనే కాకుండా భవిష్యత్తు ఆర్థిక పరిస్థితుల్నీ కలవరపెడుతోంది. ఆరోగ్యం, పొదుపులు, చిన్న చిన్న ఆనందాలన్నీ కత్తిరించి స్కూల్ ఫీజు కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తే, అది మధ్యతరగతిని నెమ్మదిగా కిందికి లాగేస్తుంది. అందుకే పాలసీ స్థాయిలో జోక్యం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల స్థాయి పెంచకపోతే, ప్రైవేట్ ఫీజులను నియంత్రించకపోతే, స్కాలర్షిప్లు అందించకపోతే, నాణ్యమైన విద్య అన్నది కలగా మిగిలిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజురోజుకీ పెరుగుతున్న ఫీజులు మధ్యతరగతి కుటుంబాలను మానసికంగా చంపేస్తోందనే చెప్పవచ్చు.
