
తాజ్ప్యాలెస్కు బాంబు బెదిరింపు
దేశ వ్యాప్తంగా వరుస బాంబు బెదిరింపులతో ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. బాంబులు పెట్టామని, కాసేపట్లో పేల్చేస్తామని వరుసగా ఈ మెయిల్స్ పెడుతూ అధికారులను ఆకతాయిలు బెంబేలెత్తిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కేరళ, బెంగళూరు ప్రాంతాల్లో ఈ బెదిరింపుల ఘటనలు అధికమయ్యాయి. ఇటీవల ఢిల్లీ సీఎం రేఖగుప్తాకు, అలాగే దాదాపు 50 పాఠశాలలకు పైగా, జామియా మిలియా యూనివర్సిటీకి, కేరళ సీఎం పినరయి విజయన్ కు, అలాగే తిరువనంతపురంలోని కోర్టుకు, శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు, ముంబై హైకోర్టుకు కూడా బాంబులతో పేల్చేస్తామనే మెయిల్ వచ్చింది. ఇలా రోజూ ఎక్కడో ఒకచోట బాంబు బెదిరింపుల మెయిల్స్ పెడుతూ గుర్తు తెలియని వ్యక్తులు కలకలం రేపుతూనే ఉన్నారు.
తాజాగా శనివారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ కు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చింది. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే బాంబ్, డాగ్ స్వ్కాడ్ తో పాటు హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు దోరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా ఆకతాయిలే చేసి ఉంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇటువంటి మెయిల్స్ పెట్టడం కూడా చట్ట విరుద్ధమేనని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
