Let's talk: editor@tmv.in
వాహనాలపై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలి: గడ్కరీ

వాహనాలపై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలి: గడ్కరీ

FL - BRTH
14 సెప్టెంబర్, 2025

కొత్త వాహనం కొనుగోలు చేస్తున్న కస్టమర్లు స్క్రాప్ సర్టిఫికెట్ ఇస్తే.. ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నితిన్ గడ్కరీ వాహన పరిశ్రమను కోరారు. ఏసీఏంఎ సదస్సులో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ అంచనాల ప్రకారం 97 లక్షల వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంటుందని, ఈ వాహనాలను తొలగిస్తే 70 లక్షల మందికి ఉపాధి దక్కుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. పాడైపోయిన, కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను పర్యావరణహితంగా తొలగించేందుకు ప్రభుత్వం స్వచ్చంద వాహన స్క్రాపింగ్ పాలసీని అమలు చేస్తోందని చెప్పారు. 97 లక్షల పాత వాహనాలను తుక్కుగా మార్చడం ద్వార కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.40 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టు వరకు సుమారు 3 లక్షల వాహనాలు తుక్కుగా మార్చినట్టు పేర్కొన్నారు. అందులో ప్రభుత్వ వాహనాలు 1.41 లక్షలు ఉన్నట్టు తెలిపారు. నెలకు సగటున 16830 వాహనాలు స్క్రాప్ గా మారుస్తున్నామని ఆయన తెలిపారు. స్క్రాపింగ్ పరిశ్రమలో ఇప్పటి వరకు ప్రైవేటు రంగం రూ.2700 కోట్ల పెట్టుబడిపెట్టినట్టు నితిన్ గడ్కరీ ప్రకటించారు. జీఎస్టీ రేట్ల మార్పు ఆటో పరిశ్రమకు లబ్ధి చేకూరుస్తుందని, వాహన స్క్రాపింగ్ పాలసీ సక్రమంగా అమలు చేస్తే ఆటోమొబైల్ పరిశ్రమ ముడిసరకు 25 శాతం వరకు తగ్గుతుందన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 27 శాతం ఇథనాల్ బ్లెండింగ్ పైన కూడా స్పందించారు. బ్రెజిల్ గత 49 ఏళ్లుగా ఈ ఇంధనాన్ని వాడుతోందన్నారు. నాణ్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టంచేశారు. అన్ని పరీక్షలు పూర్తీ చేసిన తర్వాతే ఆటో మొబైల్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ ప్రతిపాదనలను పెట్రోలియం మంత్రిత్వశాఖకు పంపుతుందని తెలిపారు. ఆ తర్వాత ఆ శాఖ కేబినెట్ కు సిఫారసు చేస్తుందని, ఆ తర్వాతనే 27 ఇథనాల్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..

వాహనాలపై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలి: గడ్కరీ - Tholi Paluku