
ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డరా? జర జాగ్రత్త
ఈ రోజుల్లో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందకపోవడం పెద్ద సమస్యగా మారింది. గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు హోటల్స్, రెస్టారెంట్స్ పై తనిఖీలు జరిపినప్పటికీ ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది ఇటీవల జరిగిన ఓ సంఘటన. కొండాపూర్లోని రైస్ బౌల్ రెస్టారెంట్ నుండి జొమాటో ద్వారా కర్డ్ రైస్ ఆర్డర్ చేసిన ఆదిత్య ఇర్రి కస్టమర్ పార్సిల్ తెరిచిన వెంటనే షాక్ అయ్యారు.
ఆర్డర్లో వండని చికెన్ ముక్కలు, కాగితం కనిపించడంతో అతను షాక్కు లోనయ్యారు. తక్షణమే ఈ సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జొమాటో, జీహెచ్ఎంసీ, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లను జతచేసి సమస్యను తెలియజేసాడు. దీంతో ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ, మీ ఫిర్యాదు తీసుకుని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపింది. జొమాటో సైతం జరిగిన తప్పుకు స్పందిస్తూ కస్టమర్కు క్షమాపణలు తెలియజేసి, ఆర్డర్ వివరాలను పంపమని తెలిపింది.
ఇలాంటి సంఘటనలు మొదటి సారి కాదు. గత ఏడాది అక్టోబర్లో, కొండాపూర్లోని ఒక విద్యార్థి చికెన్ మంచూరియన్ ఆర్డర్ చెయ్యగా, చికెన్ మంచూరియా బదులుగా చికెన్ 65 వచ్చింది. ఆ సమయంలో జొమాటో కస్టమర్ సర్వీస్ నిర్లక్ష్యంగా స్పందించింది. ఈ ఘటన తరువాత రెస్టారెంట్పై రూ.50,000 జరిమానా విధించబడింది ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. మరో సందర్భంలో, ఒక కస్టమర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినప్పటికీ, అందులో మిగతా పదార్థాలు కలిపి వండి ప్యాకింగ్లో ఇవ్వడం జరిగింది. అటువంటి ఫుడ్ సమస్యలు వినియోగదారుల ఆరోగ్యం, విశ్వసనీయతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తాయి.
నిపుణులు సలహా ప్రకారం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో ఫుడ్ క్వాలిటీ, వినియోగదారుల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కస్టమర్స్ నమ్మకాన్ని నిలుపుకోవడం ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం ఫుడ్ సర్వీసుల ముఖ్య బాధ్యత అని వారు పేర్కొన్నారు.
