
భూమి మునిగింది... గాయం మిగిలింది!
వర్షం పడితే పంటలు పండుతాయి, చెరువులు నిండుతాయి.. అప్పుడు మనం సంతోషించాలి.. అయితే అదే వర్షం ఆగకుండా కురిసి వరదల రూపంలో విరుచుకుపడితే.. అది ఆనందం కాదు, భయానక కథగా మారుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి అలాంటిదే. ఎడతెరపి వర్షాలు, పొంగిపొర్లిన నదులు, ముంచుకుపోయిన గ్రామాలు, కన్నీటి తడిన రైతులు.. ఇలా అన్నీ కలిపి ప్రకృతి పగబట్టినట్టే అనిపిస్తోంది.
జూన్ నుంచి మొదలైన ఈ వరదలు సెప్టెంబరు నాటికి భయంకరరూపం దాల్చాయి. మొదట్లో పంజాబ్ ప్రాంతంలో సుమారు 4వేల గ్రామాలు నీటమునిగి లక్షలాది మంది ఇళ్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆగస్టు నాటికి పరిస్థితి మరింత తీవ్రంగా మారి, లక్షలాది మంది తిండితిప్పలు లేక అల్లాడిపోతున్నారు. రావి, చీనాబ్, సత్లెజ్ నదులు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరదలు ఊహించని విధంగా విస్తరించాయి. జలాల్పూర్, పిర్వాలా పట్టణం లాంటి ప్రదేశాలు చీనాబ్, సత్లెజ్ సంగమంలో ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. బోట్లలో రక్షణ చర్యలు కొనసాగుతున్నా, ధనికులు ప్రైవేట్ బోట్లు ఏర్పాటు చేసుకుని తప్పించుకుంటుండగా పేదలు మాత్రం ఆశతో రాత్రింబవళ్ళు ఎదురు చూస్తున్నారు. వీధుల్లో టెంట్ల కింద వందలాది కుటుంబాలు ఆహారం కోసం తపనపడుతున్నాయి, పిల్లల రోదనలు ఆగడం లేదు, మహిళలు వర్షం ఆగాలని ప్రార్థిస్తున్నారు.
ఇక కరాచీ వంటి మహానగరాల్లో కూడా వర్షం విపరీతంగా కురిసి వీధులు నీటమునిగాయి. సింధ్ ప్రాంతం ఇంకా వరద ముప్పులో ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ షరీఫ్ వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి మరణించిన కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయినవారికి, పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ బాధితుల మాటల్లో వాస్తవం స్పష్టమవుతోంది. మూడు రోజులు బోట్ కోసం ఎదురుచూసిన ఓ తండ్రి, తన భార్య, పిల్లలు ఇంకా నీటిలో చిక్కుకుపోయారని వాపోయాడు. ఒక తల్లి తన గ్రామం నుంచి తప్పించుకుని వచ్చి, నీటిలో ఒక శవం కౌగిలించుకున్న బిడ్డ ఇంకా బతికే ఉన్న దృశ్యం చూసినట్టు కన్నీటి స్వరంతో గుర్తుచేసుకుంది.
ఈ వరదల ప్రభావం రైతులపై మరింత ఘోరంగా పడింది. లక్షల ఎకరాల్లో పంటలు మట్టిలో కలిసిపోయాయి. ఇది గత మూడు దశాబ్దాల్లోనే అత్యంత చెడు వరదలుగా పంజాబ్ రైతులు చెబుతున్నారు. బీబీసీ, రాయిటర్స్ రిపోర్టుల ప్రకారం, ఇంతవరకూ 900లకు పైగా ప్రాణ నష్టాలు సంభవించాయి. 20 లక్షల మంది ఇళ్లు వదిలి తరలించబడ్డారు. ఒక బోట్ తిరగబడటం వల్ల 9 మంది మరణించారు. రక్షక బృందాలు బోట్లు, యంత్రాలు ఉపయోగించి శక్తిమేర పనిచేస్తున్నా, వాస్తవానికి ఎక్కువగా నష్టపోతున్నది పేదవారే. ఇంకా భయం సింధ్ ప్రాంతం వైపు మళ్లింది. అక్కడికి వరదలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నా, అంతర్జాతీయ మీడియా చెబుతున్నట్టు ఈ పరిస్థితి వాతావరణ మార్పు వలన వచ్చినదే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మాన్సూన్ అసాధారణత, పొరుగుదేశాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం లాంటివి కలిపి పాకిస్తాన్ను ముంచేశాయి.
వరదలు కేవలం ఇళ్లు, పంటలు, ఆస్తులను కాదు, మానవ జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి. తిండి కోసం అలమటిస్తున్న చిన్నారుల దృశ్యాలు, నీటిలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వృద్ధుల వేదనలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆర్తనాదాలు లాంటివి మనసును కలచివేస్తాయి. ప్రకృతి పాకిస్తాన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తోంది అనే ప్రశ్న ప్రజల హృదయాల్లో నిండిపోయింది. కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది. ఇది కేవలం ఒక దేశం సమస్య కాదు, మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుకు క్రూర సంకేతం.
