
చీకటి కోసం పోరాటం
నేను ఒకప్పుడు రాత్రి ఆకాశాన్ని చూసినప్పుడు, నక్షత్రాలు నన్ను పలకరించేవి. వెండి రంగులో పాలపుంత గెలాక్సీ నా కళ్ల ముందే విరబూసేది. ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. నేను పైకి చూసినప్పుడు పొగమంచు మాత్రమే కనిపిస్తుంది. నగరాల దీపాలు నక్షత్రాల మాటలను మింగేశాయి. వీధి దీపాల కాంతి ఆకాశంలోని చీకటిని తరిమేసింది. ఒకప్పుడు కంటికి అందిన ఆ నక్షత్ర సంపద, ఇప్పుడు కేవలం జ్ఞాపకాలలో మిగిలిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేను చూసిన ఆకాశం, నా పిల్లలు చూడలేని ఆకాశమవుతోంది.
నిజానికి చీకటి అనేది భయం కాదు.. అది సహజం. చెట్లు చీకటిలో ఊపిరి పీలుస్తాయి. గబ్బిలం ఎగరాలంటే చీకటి కావాలి, పక్షి దారి పట్టాలంటే నక్షత్రాల కాంతి కావాలి. కానీ మనం ఆ నక్షత్రాల వెలుగు లేకుండా చేస్తున్నాం. ఇంటిని వెలిగించాం, వీధి దీపాలు వెలిగించాం, కానీ ఆకాశం నుంచి వచ్చే నక్షత్ర కాంతులను ఆర్పేశాం. ఇప్పుడు రాత్రి అనేది రాత్రిలా లేదు, అది కేవలం మరో రకమైన పగలు. మనిషి కళ్లకు నిద్ర కావాలి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. కానీ కృత్రిమ కాంతి ఆ లయను చెరిపేస్తోంది. నిద్ర తగ్గిపోతోంది, హార్మోన్లు మారిపోతున్నాయి, మన ఆరోగ్యం దెబ్బతింటోంది. మనం వెలుగును ఉపయోగించుకుంటున్నాం, కానీ అదే వెలుగు ఇప్పుడు మన జీవనాన్ని కదిలిస్తోంది.
ఇది కేవలం మన సమస్య కాదు, జంతువుల సమస్య కూడా. సముద్ర తాబేళ్లు తీరంలో పుడితే, అవి చంద్రుని కాంతిని చూసి సముద్రం వైపు పరిగెడతాయి. ఇప్పుడు అవి వీధిదీపాల వైపు పరిగెడుతూ మరణిస్తాయి. చిన్న పురుగులు, గబ్బిలాలు, పక్షులు లాంటివాటికి ఉండే జీవన గడియారాన్ని మన దీపాలు చెదరగొడుతున్నాయి. కాంతి అనేది శక్తి, కానీ అతిగా వెలిగితే అది మరణం కూడా అవుతుంది. అంతేకాదు ఆకాశానికి ఇప్పుడు కొత్త గాయాలు వచ్చాయి. వేల ఉపగ్రహాలు అక్కడ తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఆకాశం నిండా కేవలం నక్షత్రాలే మెరిసేవి.. ఇప్పుడా పరిస్థితి లేదు. శాస్త్రవేత్తలు ఫొటోలు తీయగానే, వాటిలో నక్షత్రాల కంటే ఉపగ్రహాల జాడలే ఎక్కువగా మెరిసిపోతున్నాయి. రాత్రి ఆకాశం సహజంగా ఉండేది, కానీ ఇప్పుడు అది మనిషి వేసిన రంగుల పటంలా మారిపోయింది.
అయినా కొన్నిచోట్ల ఇంకా నిజమైన రాత్రి దాగి ఉంది. లడాఖ్ ఎత్తయిన కొండల్లో, జైసల్మేర్ ఎడారిలో ఇంకా ఆకాశం తన అసలైన రూపంలో ఉంది. అక్కడ చీకటి నిద్రపోతుంది, అక్కడ నక్షత్రాలు తమ గానం కొనసాగిస్తాయి. అక్కడ మనకు తెలుస్తుంది.. రాత్రి అనేది ఒక ఆస్తి, ఒక వారసత్వం. వన్యప్రాణులను కాపాడినట్లే, అరణ్యాలను కాపాడినట్లే, మనం చీకటిని కూడా కాపాడుకోవాలి. నిజానికి నక్షత్రాలు ఒకప్పుడు మనకు దారి చూపించాయి. రైతు వాటిని చూసి పంటలు వేశాడు. సముద్ర యాత్రికుడు వాటిని చూసి దిశలు పట్టాడు. కవి వాటిని చూసి కవితలు రాశాడు. కానీ ఇప్పుడు మనకు నక్షత్రాలన్నీ ఒక పాత జ్ఞాపకం. మన పిల్లలు పైకి చూసినప్పుడు, వారికీ కనిపించేది ఒకటి రెండు గ్రహాలు మాత్రమే, కానీ ఆకాశపు అసలు కాంతి కాదు. అందుకే ఈ పోరాటం కేవలం నక్షత్రాల కోసమే కాదు, మన కోసం కూడా. మన సంస్కృతి, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు కోసం. చీకటిని కాపాడటం అంటే రాత్రిని కాపాడటం, రాత్రిని కాపాడటం అంటే జీవనాన్ని కాపాడటం. వెలుగులో మునిగిన మన పట్టణాలకీ చీకటి కావాలి, మన హృదయాలకు కూడా ఆ చీకటి కావాలి.. ఇదే చీకటి చెబుతున్న సత్యం..!
