
కృష్ణా జలాలపై తెలంగాణ బలమైన పోరాటం
కృష్ణా నదీ జలాల విభజనపై ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ట్రైబ్యునల్ విచారణను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను మరింత పటిష్టం చేసేందుకు కసరత్తు చేపట్టింది. నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్తో పాటు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీతో జరుగుతున్న జల వివాదాల నేపథ్యంలో ఈ సమీక్ష మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధించుకోవడమే మా లక్ష్యం. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించి, రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతాం అని ఆయన పేర్కొన్నారు. తాగునీరు, సాగునీరు సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు.
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కనీసం 65 శాతం నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని మంత్రి అన్నారు. పెరుగుతున్న జనాభా, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా తాజా డేటాను ట్రైబ్యునల్కు సమర్పించామని వివరించారు. ఈ అవకాశాన్ని ఏమాత్రం జారవిడుచుకోమని, జూన్, జులై నెలల్లో 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచడంతో పాటు, ఆపరేషన్ ప్రోటోకాల్ను అనుసరించి స్వేచ్ఛగా వినియోగించుకునే విధానాన్ని ప్రతిపాదిస్తామని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటిని పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న విషయాన్ని కూడా ట్రైబ్యునల్ ఎదుట బలంగా వినిపిస్తామని చెప్పారు.
ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలతో కూడిన ప్రత్యేక జీవోను త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకుండా పోయాయని, దీంతో కృష్ణా జలాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయామని ఉత్తమ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందింది. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చూస్తాం అని విమర్శించారు.
