
ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ ఖ్యాతి
అరుదైన అద్భుతం అది.. వేల సంవత్సరాల క్రితం ప్రకృతి ప్రసాదించిన వరం. అలల సవ్వడితో ఎగసిపడే నీలి సంద్రం ఓవైపు.. తూర్పు కనుమల్లో విచ్చుకున్న వచ్చందాల ప్రకృతి మరో వైపు.. మధ్యలో సూరీడే కిందికి దిగి.. ఎర్రరంగు పులిమినట్లు అరుదైన వారసత్వ సంపద చూపరులను కట్టిపడేస్తుంటుంది. సహజ సిద్ధమైన ప్రకృతికి ప్రతిరూపంగా.. విశాఖకు వచ్చే సందర్శకులకు వరంగా.. భీమిలిలో అందాలను ఎరుపెక్కించిన ఎర్రమట్టి దిబ్బలు నిజంగా అరుదైన సంపదే. ఆసియాలో కేవలం మూడంటే మూడు ప్రాంతాల్లోనే ఈ అద్భుతం కనువిందు చేస్తోంది. తొలుత ఇనుకకొండలుగా ఏర్పడి.. తర్వాత ఎర్రమట్టి దిబ్బలుగా రూపాంతరం చెందిన ఈ ప్రకృతి వరప్రసాదానికి సరిగ్గా పదకొండేళ్ల క్రితం జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వస్తే.. ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు కోసం పోటీ పడుతోంది.
పురావస్తు నిపుణులు హర్షం
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 2025 జాబితాలో చోటు దక్కించుకునే దిశగా తొలి అడుగు వేసింది. సహజ వారసత్వ స్థలం తాత్కాలిక జాబితాలో ఎర్రమట్టి దిబ్బలను చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. ఇటీవల కబ్జాలకు , పలు వివాదాలకు కారణమైన ఎర్రమట్టిదిబ్బలకు ఇటువంటి ఖ్యాతి లభించటం వాటి పరిరక్షణకు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు పురావస్తు నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
2014లో జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు
విశాఖపట్నం నుంచి భీమునిపట్నం వెళ్లే మార్గంలోని మట్టి దిబ్బలు 10 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాయి. ఇవి ఒకప్పుడు 40 మీటర్ల దాకా ఎత్తు ఉండేవి. జాతీయ భూ విజ్ఞాన సర్వే సంస్థ ఈ దిబ్బల ప్రదేశ రక్షణ. నిర్వహణ కోసం 2014లో జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మొత్తం 1,195 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సహజ వారసత్వ స్థలం జాబితాలో పొందుపరిచిన యునెస్కో టెక్టానిక్ సిస్టమ్, కోన్టల్ సిస్టమ్ థీమ్ గా ఎంపికయ్యే అవకాశం వుంది.
గుర్తింపు వస్తే సంరక్షణకు మార్గం
యునెస్కో గ్లోబల్ పార్కు జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు చేరితే సంరక్షణ చాలా సులువు అవుతుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రత్యేక బాడీ ద్వారా ప్రకృతి సిద్ద సందర్శన ప్రాంతంగా మరింత ఖ్యాతి పొందేందుకు వీలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం సంరక్షణ అదే విధంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని 33 దేశాల్లో 120 యునెస్కో గ్లోబల్ పార్కు లున్నాయి. ప్రపంచంలోని 196 దేశాల్లో వారసత్వ స్థలాలు గుర్తించేందుకు యునెస్కో సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత్ నుంచి 60 ప్రాంతాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో 5వ స్థానంలో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. టెక్టానిక్ సిస్టమ్, కోస్టల్ సిస్టమ్ థీమ్ ఎంపికయ్యే అవకాశం ఉందని యునెస్కో ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
ఇసుకే అయినా మట్టిదిబ్బలు
పూర్వ కాలంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. పాయలుగా ఏర్పడిన తర్వాత ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి భౌగోళిక పరంగా ఇది ఇసుక నుండి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుర రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారుతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిబ్బల్లోని ఇసుక, మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల వీటిని ఎర్ర మట్టి దిబ్బలుగా పిలవడం అలవాటైపోయింది.
ఎప్పుడు ఏర్పడ్డాయంటే?
ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారు 18,500 నుంచి 20,000 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినట్లు భౌగోళిక చరిత్ర చెబుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం ప్రస్తుత తీర రేఖ నుంచి కనీసం 5 నుంచి 10 కి.మీ వెనక్కి ఉండేది. తూర్పు కనుమల్లో ఖొండలైట్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నేట్, క్వార్ట్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్స్ స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. భారీ వర్షాలు పడే సమయంలో ఈ కొండల నుంచి నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ ఆసక్తికరమైన దిబ్బల్ని 1,886లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ సూపరింటెండెంట్ విలియం కింగ్ రికార్డుల్లో నమోదు చేశారు. వీటిని అప్పట్లో బ్యాడ్ ల్యాండ్స్ అని పిలిచేవారు. ఎర్రగా ఎందుకు కనిపిస్తున్నాయనే దానిపై పరిశో ధనలు చేసిన తర్వాత.. అందులో ఉన్న ఖనిజాల వివరాలు, ఇవి ఎలా ఏర్పడ్డాయని తెలుసుకొని అప్పుడు ఎర్రమట్టి దిబ్బలు గా నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. ఇవి క్వాటర్నరీ యుగానికి ఆనవాళ్లు గా నిర్ధారించారు. అప్పట్లో ఈ దిబ్బల్లో మానవ జీవన గమన విశేషాలు కూడా లభ్యమయ్యాయని చరిత్ర చెబుతోంది.
చిన్నచిన్న పాయలుగా రూపాంతరం
కొట్టుకొచ్చి సముద్ర తీరం లోకి ఇసుకతో కలిసిపోయి మిశ్రమంగా ఏర్పడి పేరుకున్నాయి. కొండల్లోని మట్టి, సము ద్రవు ఇసుక, ఖొండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి కాస్తా గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. ఏర్పడిన సమయంలో వీటిని ఎర్ర ఇసుక కొండలు గా పిలిచేవారు. కాలక్రమేణా ఈ గుట్టల్లో పేరుకుపోయిన మిశ్రమాలు వదులుగా ఉండే చోట నీటి ప్రవాహాల తాకిడితో కొట్టుకొని పోవడం వల్ల ఆ ప్రాంతం చిన్న చిన్న పాయలుగా రూపాంతరం చెందింది. క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3వేల సంవత్సరాల క్రితం వరకూ ఈ ఎర్రమట్టి దిబ్బలు నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి.
మూర్తి యాదవ్ న్యాయపోరాటంతో బఫర్ జోన్
ఎర్ర మట్టి దెబ్బలు కబ్జాకు గురవుతుండటంతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వం బఫర్ జోన్ ను ఏర్పాటు చేసింది. వారసత్వ ప్రదేశంగా జీఎస్ఐ గుర్తించిన తర్వాత 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రక్షిత ప్రదేశాల విభాగంలో ఎర్రమట్టి దిబ్బల్ని చేర్చి నప్పటికి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు . కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తూ.. దిబ్బలపై విధ్వంస రచన చేస్తున్నరంటూ దాఖలైన కేసు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడం లేదు. యునెస్కో గుర్తింపు వస్తే ఎర్రమట్టి దిబ్బల సంరక్షణకు ఇక ఎదురుండదని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
